వీఎంసీ నోటీసులు.. ఆడిట్ అలక!
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:14 AM
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయన్న ఆనందంలో ఉన్న దుర్గగుడి అధికారులకు ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అటు ఆడిట్ శాఖ షాక్ ఇచ్చాయి. కోట్ల రూపాయల పన్నులు చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వగా, అమ్మవారి దర్శనం సరిగా చేయించలేదని పెట్టిన బిల్లులు చేయకుండా ఆడిట్ అధికారులు అలక వహించారు. దీంతో బిల్లులు అవ్వక, పన్నులు కట్టలేక దుర్గగుడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
దుర్గగుడిపై రెండు శాఖల ముప్పేట దాడి
రూ.5.34 కోట్ల పన్ను కట్టాలని దుర్గగుడికి వీఎంసీ నోటీసు
మహామండపం, రాజగోపురానికి రూ.2.36 కోట్లు
సీవీ రెడ్డి చారిటీస్‌కు రూ.2.98 కోట్లు చెల్లించాలని స్పష్టం
దసరాలో మమ్మల్ని పట్టించుకోలేదంటూ ఆడిట్ అధికారుల అలక
దసరా బిల్లులు నిలిపివేత.. తలలు పట్టుకుంటున్న దుర్గగుడి అధికారులు
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయన్న ఆనందంలో ఉన్న దుర్గగుడి అధికారులకు ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అటు ఆడిట్ శాఖ షాక్ ఇచ్చాయి. కోట్ల రూపాయల పన్నులు చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వగా, అమ్మవారి దర్శనం సరిగా చేయించలేదని పెట్టిన బిల్లులు చేయకుండా ఆడిట్ అధికారులు అలక వహించారు. దీంతో బిల్లులు అవ్వక, పన్నులు కట్టలేక దుర్గగుడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
(విజయవాడ/వన్‌టౌన్ -ఆంధ్రజ్యోతి) శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానంపై రెండు ప్రభుత్వ శాఖలు ముప్పేట దాడికి దిగాయి. భారీ మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించాలని దుర్గగుడికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం డిమాండ్ నోటీసులు ఇచ్చారు. సుమారు రూ.5.34 కోట్లు చెల్లించాలంటూ దుర్గగుడి ఈవో రామారావును నేరుగా కలిసి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సృజన, సర్కిల్ -1 సహాయ కమిషనర్ ఎలీనా ఈ నోటీసులు అందజేశారు. రాజగోపురం, మహామండపం నిర్మాణం చేసినప్పటి నుంచి పన్ను చెల్లించాలని నోటీసులో పేర్కొనడంతో దుర్గగుడి అధికారులు కంగుతిన్నారు. 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం వరకు రూ.2.36 కోట్లు బకాయిలు చెల్లించాని నోటీసులో తెలిపారు. వన్‌టౌన్ పాడి వీధిలోని సీవీరెడ్డి చారిటీస్‌కు చెందిన నిర్మాణాలకు 2011 నుంచి రూ.2.98 కోట్లు బకాయిలు ఉన్నాయని స్పష్టం చేశారు. గతేడాది సీవీరెడ్డి చారిటీస్ నిర్మాణాలకు సంబంధించి రూ.39 లక్షల పన్నును దుర్గగుడి అధికారులు చెల్లించారు. అనంతరం ఈ అంశాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆ సమయంలో దేవదాయశాఖ కమిషనర్ హిందూ ధార్మిక సంస్థలకు చెందిన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వరాదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా నోటీసులు కలకలం రేపుతున్నాయి. వీఎంసీ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేసి మహామండపంలోని అన్ని అంతస్థులు, అక్కడ ఉన్న షాపులను పరిశీలించారు.
అమ్మవారి దర ్శనానికి వస్తే రాచమర్యాదలు చేయలేదని..
ఇంద్రకీలాద్రిపై ఇటీవల జరిగిన దసరా మహోత్సవాలలో తాము అమ్మవారి దర ్శనానికి వస్తే రాచమర్యాదలు చేయలేదన్న కారణంగా విజయవాడ బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో ఉన్న స్టేట్ ఆడిట్ కార్యాలయం అధికారులు దుర్గగుడికి సంబంధించిన బిల్లులు వేటినీ మంజూరు చేయకుండా నిలిపివేసినట్లు సమాచారం. ప్రీ ఆడిట్ చేయకుండా బిల్లులు తొక్కి పెట్టడంతో దసరా పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాక ఆలయ అధికారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దసరా మహోత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం వీఐపీలకు టైం స్లాట్‌లను కేటాయించారు. వివిధ పాయింట్ల నుంచి వీఐపీలు వచ్చేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విస్తృత ప్రచారం కూడా చేశారు. అయితే దుర్గగుడికి చెందిన జమ్మిదొడ్డి కార్యాలయంలోనే ఉంటున్న స్టేట్ ఆడిట్ కార్యాలయం నుంచి కొందరు అధికారులు ఈనెల 10న అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆడిట్ విభాగం కోసం ఒక కారును కేటాయించారు. అయితే మరో కారుకు కూడా పాస్ అడిగారు. దుర్గగుడికి వచ్చే వీఐపీల తాకిడి దృష్ట్యా రెండో కారుకు పాస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో 10న అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఆడిట్ అధికారులను ఓం టర్నింగ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద రూ 500 టికెట్లు కూడా లేకపోవడంతో దర్శనానికి అనుమతించలేదు. ఆడిట్ అధికారులు తాము నేరుగా వెళ్లాల్సిందేనని, తమకు ప్రొటోకాల్ వర్తిస్తుందని పోలీసులతో చెప్పారు. వారితో అరగంట పాటు వాగ్వాదం జరిగినా ఆడిట్ అధికారులు అక్కడే ఉండిపోయారు. ఇంతలో విషయం తెలుసుకున్న దుర్గగుడి అధికారులు వారి వద్దకు వచ్చి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ విషయంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆడిట్ అధికారులు ఇప్పుడు దుర్గగుడికి చెందిన దసరా బిల్లులను వేటినీ ప్రీ ఆడిట్ చేయకుండా నిలిపివేశారు. దుర్గగుడి అధికారులు అడుగుతున్నా సమాధానం ఇవ్వడం లేదు. పెద్ద మొత్తాలకు సంబంధించిన బిల్లులు ఆగి పోవడంతో దసరా పనులు చేసిన వాళ్లకు చెల్లింపుల కోసం తమపై ఒత్తిడి పెరుగుతోందని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.