గుండెల్లో రైళ్లు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:58 AM
ఒంటరిగా రైల్వే ట్రాక్‌పై నడిచి వెళ్లాలంటే భయం. రైలు.. మధ్యలో ఆగితే కిందకు దిగాలంటే భయం. ఇదేదో సాధారణమైన, చిన్న రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితో కాదు. దేశంలోనే ఏ1 రైల్వేస్టేషన్‌గా పేరొందిన విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద దుస్థితి. స్టేషన్ లోపలే కాదు.. బయటకు వెళ్లాలన్నా ఈ భయం వెంటాడుతోంది. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ సంచారం దడ పుట్టిస్తుంటే.. ఇటీవల జరిగిన లోకో పైలెట్ హత్య మరింత ఆందోళనలోకి నెట్టింది.
దయచేసి వినండి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జాగ్రత్తండి..
గంజాయి, బ్లేడ్‌బ్యాచ్, ఆకతాయిలకు అడ్డాగా ట్రాక్‌లు
ఇటీవల లోకో పైలెట్ హత్య తర్వాత భయం భయం
ఒంటరిగా తిరగడానికి బెదిరిపోతున్న ఉద్యోగులు
గంజాయి బ్యాచ్‌కు ఆవాసాలుగా ఫుట్‌పాత్‌లు
నైజాంగేటు వద్ద పరిస్థితి మరీ దారుణం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొద్దిరోజుల క్రితం.. ఇంజన్‌ను తీసుకురావడానికి నైజాంగేటు వద్ద ఉన్న పాత ఎఫ్ క్యాబిన్ వద్దకు వెళ్లిన లోకో పైలెట్ ఎబునైజర్‌ను బిహార్‌కు చెందిన దేవేంద్ర సాహు అనే యువకుడు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ ఘటనకు ముందు నైజాంగేటు వద్ద ఆటోలో నిద్రపోతున్న డ్రైవర్‌పైనా దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను ఓ రకమైన భయం ఆవహించింది. ఈ భయం అటు రైల్వే ఉద్యోగుల్లోనూ, ఇటు ప్రయాణికుల్లోనూ కనిపిస్తోంది. విధి నిర్వహణలో ట్రాక్‌పై నుంచి చీకటి ప్రదేశంలోకి వెళ్లడానికి సిబ్బంది గుండెలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.
నైజాంగేటు వద్ద భయంగా..
గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. స్టేషన్‌కు పరిసర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. వాటిపై ఎక్కువగా యాచకులు, అనాథలు ఉంటారు. వారికి ఈ ఫుట్‌పాత్‌లే నివాస కేంద్రాలు. వర్షాలు కురిసినప్పుడు మాత్రం పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటారు. ఇలా ఫుట్‌పాత్‌లపై ఉంటున్న వారిలో గంజాయి బాబులు ఎక్కువ. పగలంతా వేర్వేరు ప్రదేశాల్లో తిరిగిన వారు రాత్రికి స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఇవికాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లోకి చేరుకోవడానికి ప్రధాన ద్వారాలే కాకుండా వేర్వేరు మార్గాలున్నాయి. గంజాయి బాబులు ప్లాట్‌ఫాంలు దాటాక ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నారు. అలాగే, రైల్వే కోర్టుకు కొంతదూరాన ఉన్న ట్రాక్‌లపై కొన్ని భోగీలు నిత్యం నిలిచి ఉంటాయి. కొంతమంది ఈ భోగీల్లో ఉంటున్నారు. నైజాంగేటు ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణం. పాతరాజరాజేశ్వరిపేట, అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వరకు ఎలాంటి విద్యుద్దీపాలు ఉండవు. దీంతో గంజాయి బ్యాచ్ రైల్వేట్రాక్‌లపై సంచారం చేస్తోంది.
పట్టాలపైనే గంజాయి వ్యాపారం
గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లు రైలు పట్టాలపైనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్యాచ్ పట్టాలపై ఉండటానికి కారణం కూడా ఉంది. రాత్రి సమయాల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తారు. ఎవరైనా కనిపిస్తే అదుపులోకి తీసుకుంటారు. వారికి చిక్కకుండా ఉండటానికి పట్టాలపై కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం. రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌లపై ఎక్కువగా గ్యాంగ్‌మెన్లు, లోకో పైలెట్లు తిరుగుతుంటారు. ఒక రైలుకు రెండో ఇంజన్‌ను లింక్ చేయాలనుకున్నప్పుడు యార్డు వద్ద ఉన్న ఇంజన్‌ను తీసుకురావడానికి పైలెట్లు ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తారు. పట్టాలపై ఏదైనా సాంకేతిక సమస్య ఉన్నప్పుడు టార్చిలైట్ వేసుకుని వెళ్తారు. లోకో పైలెట్ హత్య తర్వాత నుంచి ఇంజన్ షంటింగ్‌కు వెళ్లాలన్నా, ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాలన్నా లోకో పైలెట్లు, గ్యాంగ్‌మెన్లు తోడుగా మరొకరిని తీసుకెళ్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్శిల్ ఆఫీసు, రైల్వే ఆసుపత్రి, రైల్వేకోర్టు రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఫుట్‌ఫాత్‌లపై గంజాయి బ్యాచ్ యాచకుల మాదిరిగా పడుకుని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లోకో పైలెట్‌పై దాడి చేసిన దేవేంద్ర సాహు గంజాయి మత్తులో ఉన్నట్టు సమాచారం. గంజాయి అమ్ముకోవడానికి, తాగడానికి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు అనువుగా ఉండటంతో ఇక్కడే స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
రెండు రోజులకోసారి కార్డెన్ సెర్చ్
రైల్వేస్టేషన్ నుంచి అవుటర్ వరకు నిఘాను కట్టుదిట్టం చేశాం. రాత్రి 9 గంటల నుంచి అన్ని ట్రాక్‌లపై ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది నాకాబందీ నిర్వహిస్తున్నారు. డీజిల్ షెడ్, యార్డు, వించిపేట, రాజరాజేశ్వరిపేటతో పాటు మొత్తం 20 ప్రదేశాలను హాట్‌స్పాట్లుగా గుర్తించాం. ఈ ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాం. రెండు రోజులకోసారి కార్డెన్ సెర్చ్ చేస్తున్నాం.
- జేవీ రమణ, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్