నేడే డ్రోన్ షో
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:52 AM
ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న డ్రోన్ షోకు వేళైంది. మంగళవారం సాయంత్రం పున్నమిఘాట్‌లో ఈ షో ప్రారంభంకానుంది. మొత్తం ఏడు థీమ్ చిత్రాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తారు.
పున్నమిఘాట్‌కు చేరిన 5,500 డ్రోన్లు
సాయంత్రం 7 గంటల తర్వాత షో
4 గంటల నుంచే వివిధ కార్యక్రమాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న లేజర్ బీమ్ షో
మ్యూజిక్ బ్యాండ్, బాణాసంచా హంగామా
ప్రవేశం ఉచితం.. రేపు కూడా కొనసాగింపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న డ్రోన్ షోకు వేళైంది. మంగళవారం సాయంత్రం పున్నమిఘాట్‌లో ఈ షో ప్రారంభంకానుంది. మొత్తం ఏడు థీమ్ చిత్రాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తారు. విమానయానం.. తద్వారా డ్రోన్లయానానికి పితామహుడిగా రైట్ బ్రదర్స్ చిత్రాన్ని ముందుగా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత భారీ బోయింగ్ విమానం, డ్రోన్, రాజధాని అమరావతిని స్మరించేలా ధ్యానబుద్ధుడు, గ్లోబ్ చిత్రాలను ప్రదర్శిస్తారు. జాతీయ జెండాతో పాటు ఐసీఏవో లోగోను ఆవిష్కరిస్తారు. మొత్తం 5,500 డ్రోన్లతో ఆకాశంలో ఈ సప్తవర్ణ చిత్రాలు ఆవిష్కృతమవుతాయి. దాదాపు అరగంట పాటు షో జరుగుతుంది. ప్రత్యేకంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్ల ద్వారా వీటిని ఆవిష్కరిస్తారు. ఈ చిత్రాలన్నీ వరుస క్రమంలో చక్కగా కనిపించటానికి డ్రోన్లను ఆయా స్థానాల్లో నిలబెట్టేందుకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా సోమవారం డ్రోన్లన్నింటినీ సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రదర్శన మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ముంబయి డ్యాన్సర్ల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అవి పూర్తికాగానే లేజర్ బీమ్ షో ఉంటుంది. అలాగే, వీనులవిందైన సంగీతం వీక్షకులను కట్టిపడేస్తుంది. చివరిగా బాణాసంచా పేలుళ్లు ప్రదర్శనలో హైలైట్‌గా నిలుస్తాయి.