కొట్టుకు పోయిన రోడ్లు.. రాకపోకలు బంద్
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:18 AM
వరదలకు వంతెనల వద్ద అప్రోచ్ రోడ్లు కొట్టుకు పొవడంతో, పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తిరువూరు: వరదలకు వంతెనల వద్ద అప్రోచ్ రోడ్లు కొట్టుకు పొవడంతో, పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చౌటపల్లి వద్ద వెదుళ్లవాగు సమీపంలో రోడ్డు, చిట్యాల గానుగపాడు గ్రామాల మధ్య టేకులపల్లి వద్ద, వెదుళ్లవాగు పాయ బ్రిడ్జి వద్ద అప్రోచ్‌రోడ్లు కొట్టుకు పోవడంతో, గానుగపాడు, జి.కొత్తూరు, చిక్కుళ్లగూడెం, పల్లెర్లమూడి తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు, గ్రామస్తులు ఎరువులు, పురుగుమందులు, ఇతర అవసరాల నిమిత్తం తిరువూరు వచ్చేందుకు, దూరం అయిన చింతలపాడు మీదుగా తిరిగి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. వినగడప వద్ద కట్టలేరుపై బ్రిడ్జి కూలడం సమీపంలో వేసిన డెవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో, కొత్తపల్లి, వినగడప, కనుమూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు గంపలగూడెం, తిరువూరుకు వెళ్లాలంటే జి.కొత్తూరు, చింతలపాడు మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. అధికారులు వాగుల వద్ద రోడ్లకు పడిన గండ్లు పూడ్పించేలా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.
అంచనాలు రూపొందిస్తున్నాం
గాయత్రిదేవి, అర్‌అడ్‌బీ జేఈ
మండలంలో చౌటపల్లి, టేకులపల్లి వద్ద వెదుళ్లవాగుల వద్ద రోడ్లుకు పడ్డ గండ్లు పూడ్పించేందుకు అంచనాలు రూపొందిస్తున్నట్టు జేఈ తెలిపారు. వరదనీటి ప్రవాహం తగ్గిన తదుపరి ఏమేరకు గండి పడిందో పరిశీలించి, తగిన విధంగా అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు.