సున్నపురాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:47 AM
సున్నపురాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు బాపులపాడు తహసీల్దార్ నాగభూషణం తెలిపారు.
మండల సర్వేయర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
బాపులపాడు తహసీల్దార్ నాగభూషణం
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన
హనుమాన్‌జంక్షన్‌రూరల్ : సున్నపురాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు బాపులపాడు తహసీల్దార్ నాగభూషణం తెలిపారు. మల్లవల్లిలో అక్రమంగా సున్నపురాయి తవ్వి తరలిస్తుండటంపై ఆంధ్రజ్యోతి ‘గుట్టుగా సున్నపురాయి తరలింపు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ నాగభూషణం మల్లవల్లిలో జరుగుతున్న తవ్వకాలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ మొక్కలు వేసుకునేందుకే తవ్వుతున్నామని రైతు చెప్పారన్నారు. సున్నపురాయి నాణ్యత తేల్చేందుకు, ఎక్కడకు తరలిస్తున్నారో తెలుసుకునేందుకు మండల సర్వేయర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. వారి నిర్ణయం మేరకు చర్యలుంటాయన్నారు.