Share News

పిన్నెల్లి అండతో రెచ్చిపోయారు

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:28 AM

జయవాడలో హైకోర్టు న్యాయవాది హరిబాబును పల్నాడు పోలీసులు వేధించడం వెనుక అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది. ఆయన అండదండలు చూసుకుని అప్పటి గురజాల డీఎస్పీ ఎ.పల్లంరాజు, పిడుగురాళ్ల ఎస్‌ఐ రబ్బానీ, కానిస్టేబుల్‌ వెంకటరావు వీరంగం వేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

పిన్నెల్లి అండతో రెచ్చిపోయారు

పల్నాడు పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు

హైకోర్టు న్యాయవాది వేధింపుల వెనుక వైసీపీ ఒత్తిళ్లు

వేధింపుల్లో కీలక సూత్రధారిగా డీఎస్పీ పల్లంరాజు

ఆయన చెప్పినట్టు చేసిన ఎస్‌ఐ రబ్బానీ, కానిస్టేబుల్‌ వెంకటరావు

పల్లంరాజుపై ఆది నుంచి ఆరోపణలు

విజయవాడ, కాకినాడలో అనేక అక్రమాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) విజయవాడలో హైకోర్టు న్యాయవాది హరిబాబును పల్నాడు పోలీసులు వేధించడం వెనుక అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది. ఆయన అండదండలు చూసుకుని అప్పటి గురజాల డీఎస్పీ ఎ.పల్లంరాజు, పిడుగురాళ్ల ఎస్‌ఐ రబ్బానీ, కానిస్టేబుల్‌ వెంకటరావు వీరంగం వేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. హరిబాబుపై జరిగిన వేధింపులకు సంబంధించి పిడుగురాళ్ల పీఎస్‌లో నమోదైన కేసు విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు పిన్నెల్లి అనుచరుడు కర్నాటి వీరభద్రరావు వైపు వకల్తా తీసుకున్నారు. హరిబాబు నుంచి వీరభద్రరావు తీసుకున్న అప్పును తిరిగి ఇప్పించకపోగా అతడి ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనితోపాటు హరిబాబు వద్ద నుంచి రూ.కోటి వరకు లాగేశారు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటితోపాటు డీఎస్పీ పల్లంరాజు పోలీసు ఉద్యోగంలో అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన అక్రమాల చిట్టా తాజాగా బయటకు వస్తోంది.

విజయవాడలో పల్లంరాజు మార్కు

పల్లంరాజు 1991లో ఎస్‌ఐగా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత నుంచి ఆయన సర్వీసు మొత్తం విజయవాడలో సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన పల్లంరాజు 20 ఏళ్లకుపైగా విజయవాడలో పనిచేశారు. ఎస్‌ఐగా కమిషనరేట్‌లో పోస్టింగ్‌ తీసుకుని ఇక్కడే ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్‌గా పటమట, టాస్క్‌ఫోర్స్‌ వంటి కీలక పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. నాడు విజయవాడలో జరిగిన భూవివాదాల కేసుల్లో సెటిల్‌మెంట్లు చేసి లక్షలాది రూపాయలను వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. నీతి నిజాయితీగా పనిచేసి ఒక మార్కును వేయించుకున్న అధికారులకంటే కమిషనరేట్‌లో పల్లంరాజు మార్క్‌ ఎక్కువగా కనిపిస్తోంది. పోలీస్‌ శాఖలో ఎవరిని కదిపినా పల్లంరాజు గురించి పెద్ద చిట్టా విప్పుతున్నారు. ఈయన ఇక్కడ పనిచేసినప్పుడే భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నట్టు సమాచారం. విజయవాడలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో పాటు అక్రమాలకు పాల్పడే మాఫియాలతో ఈయనకు ఇప్పటికీ సంబంఽధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. పోలీస్‌శాఖలో పల్లంరాజును అతడి స్నేహితులు బిగ్‌షాట్‌ అని ముద్దుగా పిలుచుకుంటారని.. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో ఉన్నారో ఇట్టే తెలుస్తోంది.

కాకినాడలోనూ అదే దూకుడు

డీఎస్పీగా పదోన్నతి పొందిన ఈయనకు కాకినాడలో పోస్టింగ్‌ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు అక్కడ అనేక అక్రమాల బాగోతాలు నడిపినట్లు సమాచారం. అక్కడ సీసీఎస్‌ డీఎస్పీగా పనిచేశారు. విశాల్‌ గున్నీ ఎస్పీగా ఉన్నప్పుడు క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులను పల్లంరాజుకు అప్పగించారు. ఆ సమయంలో అక్కడే అదనపు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డికి విధేయుడిగా మారారు. విశాల్‌ గున్నీ అప్పగించిన బాధ్యతలతో పల్లంరాజు తనకు తాను ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా ఒక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి సహాయకులుగా ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఉంటారు. పల్లంరాజు అనధికారి కంగా ఎస్పీ స్పెషల్‌ పార్టీ పేరుతో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఒక క్రికెట్‌ బుకీని అరెస్టు చేసి వారానికి పైగా రహస్య ప్రదేశంలో ఉంచారని, ఆ బుకీ ద్వారా ఇతర బుకీలకు ఫోన్లు చేయించి కోట్లాది రూపా యలను వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులతోనే విజయవాడకు చెంతనే ఉన్న తాడేపల్లిలో ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి మొక్కల ప్రేమికుడిగా మారినట్టు తెలిసింది. ఈ స్థలంలో ఈయన ఒక నర్సరీని నడుపుతున్నట్టు సమాచారం. ఈ స్థలాన్ని ఈయన కొను గోలు చేయలేదని, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో కానుకగా తీసుకున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. 2019 తర్వాత కూడా కాకినాడలో పనిచేయాలని పల్లంరాజు భావించారని, అయితే అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈయన్ను పనికట్టుకుని మరీ బదిలీ చేయించినట్టు తెలిసింది. చంద్రశేఖర్‌రెడ్డికి అనుచరులుగా ఉన్న బుకీలను వేధించి కోట్లాది రూపా యలు వసూలు చేయడమే దీనికి కారణమని సమాచారం.

పిన్నెల్లి అనుచరుడిగా అవతారం!

రవిశంకర్‌రెడ్డి పల్నాడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనే స్వయంగా పల్లంరాజును గురజాల డీఎస్పీగా రప్పించుకున్నారని సమాచారం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుచరుడిగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే హైకోర్టు న్యాయవాది హరిబాబుపై సర్వీసు రివాల్వర్‌ గురిపెట్టి మరీ ఆయన ఆస్తులు కర్నాటి వీరభద్రరావు పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఎస్‌ఐ రబ్బానీ, కానిస్టేబుల్‌ వెంకట రావు పలుదఫాలుగా హరిబాబు నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారని, ఈ డబ్బులను ఈ ముగ్గురు కలిసి పంచుకున్నారని ప్రచారం నడుస్తోంది. కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఈ డబ్బుల లెక్కలు తేలడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Oct 31 , 2024 | 01:28 AM