త్వరలో ఆపరేషన్ బుడమేరు!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:37 AM
బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలా వరకు కుచించుకుపోయిందని.. దీనికోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆపరేషన్ ‘బుడమేరు’ పేరిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.బుడమేరు ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు.
విద్యాధరపురం, సెప్టెంబరు 11 : బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలా వరకు కుచించుకుపోయిందని.. దీనికోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆపరేషన్ ‘బుడమేరు’ పేరిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.బుడమేరు ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన విద్యాధరపురం, జక్కంపూడి, కుందావరి కండ్రికలో అధికారులతో కలిసి ఆయన బుధవారం పర్యటించారు. జక్కంపూడి, వైఎ్‌సఆర్ కాలనీలలో బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయన వెంట కుమార్తె సింధూర కూడా ఉన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలలో పది వేలమంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని బుధవారం సాయంత్రానికల్లా దాదాపు అన్ని ప్రాంతాల్లో పరిస్థితులను ఒక కొలిక్కి తీసుకువస్తామన్నారు. త్రీవమైన వరద ఇబ్బందులను సిఎంతో పాటు మంత్రులు, అధికారులు పదిరోజులపాటు కష్టపడి సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. ఐదు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉందని, దానిని కూడా తగ్గించివేస్తామని చెప్పారు. మనిసిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నామన్నారు. బుడమేరు ప్రవాహనికి ఉన్న ఆటంకాలను అధిగమించటంపై ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.