నివాసాల మధ్య మద్యం దుకాణం వద్దు
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:25 AM
గత వైసీసీ ప్రభుత్వం మద్యంపై ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో విచ్చలవిడిగా నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిందని, ఆ పొరపాటును కూటమి ప్రభుత్వం చేయొద్దని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీనగర్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గత వైసీసీ ప్రభుత్వం మద్యంపై ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో విచ్చలవిడిగా నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిందని, ఆ పొరపాటును కూటమి ప్రభుత్వం చేయొద్దని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహానాడు రోడ్డులోని రామచంద్రనగర్‌కాలనీ మెయిన్‌రోడ్డులో నూతనం గా మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీరామచంద్రనగర్, కాలనీ, సమీప కాలనీల మహిళలు దుకాణం వద్ద ధర్నా చేశారు. గతంలో ఈ రోడ్డులో మద్యం షాపు ఉండడంతో రాత్రి సమయంలో బహిరంగా మద్యం తాగడంతో పాటు మద్యం ఖాళీ సీసాలు రోడ్లపైనే పగలగొట్టేవా రని, ఒంటరిగా మహిళలు వెళ్తుంటే మందుబాబులు అసభ్యకరంగా ప్రవర్తించేవారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ బాధలు గుర్తించి నివాసాల మధ్య మద్యం షాపును ఏర్పాటు చేయొద్దని మహిళలు కోరారు.