Share News

ఏడాదిన్నరగా వెతుకుతున్నారు!

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:18 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతన తహసీల్దార్‌ కార్యాలయ భవనం ఏర్పాటులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏడాదిన్నరగా భవనం వెతికే పనిలోనే ఉన్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెండు మండలాల కల తీరిందన్న ఆనందం కూడా తమకు లేకుండా చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఏడాదిన్నరగా వెతుకుతున్నారు!

నూతన తహసీల్దార్‌ కార్యాలయ భవనం ఏర్పాటులో నిర్లక్ష్యం

మచిలీపట్నం నియోజకవర్గం ఉత్తర, దక్షిణ మండలాలుగా విభజన

రెండో తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటుకు 2023 లోనే అనుమతి

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతన తహసీల్దార్‌ కార్యాలయ భవనం ఏర్పాటులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏడాదిన్నరగా భవనం వెతికే పనిలోనే ఉన్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెండు మండలాల కల తీరిందన్న ఆనందం కూడా తమకు లేకుండా చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం నగరంలోని 50 డివిజన్‌లతో పాటు, మండలంలోని 34 గ్రామ పంచాయతీలు గతంలో ఒకే తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో ఉండేవి. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఉత్తర, దక్షిణ మండలాలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న పాత కార్యాలయంలో ఉత్తర మండలాన్ని కొనసాగించాలని, దక్షిణ మండలానికి నూతన కార్యాల యం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దక్షిణ మండల కార్యాలయానికి రెండు, మూడు భవనాలు చూసినా కార్యాలయం మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో రెండు మండలాలకు తహసీల్దార్లను నియమించారు. రెవెన్యూ రికార్డుల్లో రెండు మండలాలుగా ఉన్నా ఒకే కార్యాలయంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. దక్షిణ మండలానికి నూతన కార్యా లయం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారు.

ఏడాదిన్నర గడిచినా సమకూరని కార్యాలయం

మచిలీపట్నం నగరం, మండలాన్ని రెండు తహసీల్దార్‌ కార్యాలయాలుగా విభజిస్తూ 2023, ఫిబ్రవరి 28న ప్రభుత్వ జీవో ఆర్‌టీ నంబరు 213ను జారీ చేసినా నేటికీ రెండవ తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం దృష్టిలో మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు మండలాలు, ఇద్దరు తహసీల్దార్లు ఉన్నట్లుగా చూపారు. దక్షిణ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని తొలుత నోబుల్‌ కళాశాల ఎదురుగా ఉన్న బందరు బీడీ, కిళ్లీ, సోడా వర్తకుల సంఘం భవనంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ భవనం పాతది కావడం, వర్షం కురిసిన సమయంలో భవనంలోని గదుల్లో నీరు పడుతుండటంతో అక్కడ కార్యాలయాన్ని నడపలేమని సిబ్బంది చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించారు. ఆ తర్వాత చింత చెట్టు సెంటరులో ఉన్న మీసేవా కేంద్రం భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ భవనం బాగానే ఉన్నా ఏదో కారణం చూపి అక్కడ ఏర్పాటు చేయకుండా నిలిపివేశారు. తదుపరి కాలేఖాన్‌పేట, పరిసర ప్రాంతాల్లో నూతన తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు కోసం అద్దెభవనం తీసుకుంటామని చెబుతూ కాలయాపన చేయడమే తప్ప భవనాన్ని మాత్రం ఎంపిక చేయలేదు. దక్షిణ మండల పరిధిలోని ప్రజలకు అందుబాటులో తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని గత నెలలో జరిగిన గ్రామసభల్లో ఈ మండల పరిధిలోని సర్పంచ్‌లు, కూటమి నాయకులు, ప్రజలు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువచ్చారు.

దక్షిణ మండలం పరిధిలోని ప్రాంతాలు ఇవీ..

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని దక్షిణ మండలం పరిధిలోకి ఎస్‌ఎన్‌ గొల్లపాలెం, గుండుపాలెం, రుద్రవరం, కోన, పోలాటితిప్ప, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి, పెదయాదర, నెలకుర్రు, పల్లెతుమ్మలపాలెం పంచాయతీలను, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 20 నుంచి 39 డివిజన్‌లను చేర్చారు. ఈ మండలానికి తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాల వారీగా వీఆర్వోలు, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. కానీ భవనం మాత్రం ఏర్పాటు చేయడం లేదు.

ఉత్తరం మండల పరిధిలోని ప్రాంతాలు..

ఉత్తరం మండలం పరిధిలోకి పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, గోకవరం, మంగినపూడి, బుద్దాలపాలెం, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, బొర్రపోతుపాలెం, పోతేపల్లి, గోపువానిపాలెం, అరిసేపల్లి, హుస్సేన్‌పాలెం, కరగ్రహారం, మాచవరం, చిలకలపూడి ప్రాంతాలు వస్తాయి. అలాగే మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 1 నుంచి 19 డివిజన్లు, 40 నుంచి 50 డివిజన్లు ఉన్నాయి. ఈ మండలానికి గత నెలాఖరు వరకు తహసీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ పదవీ విరమణ చేశారు. వేరెవరినీ తహసీల్దార్‌గా నియమించకుండా, దక్షిణ మండల తహసీల్దార్‌ను ఇన్‌చార్జిగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. 30 ఏళ్లుగా మచిలీపట్నం మండలాన్ని రెండుగా విభజించాలని కోరుతూ వచ్చామని, ఇన్నేళ్లకు ప్రభుత్వం అనుమతినిస్తే నూతన మండలానికి తహసీల్దార్‌ కార్యాలయం భవనం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:18 AM