Share News

స్వచ్ఛ బందరుకు కలిసి పనిచేద్దాం

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:08 AM

ఫొటోలకు ఫోజులిచ్చేవారు కాకుండా నిజంగా పనిచేసేవాళ్లు నాతో పనిచేసేందుకు రండి.. బంగారు, స్వచ్ఛ బందరుగా తీర్చిదిద్దుదాం.. అని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం మూడు స్తంభాల సెంటర్‌ నుంచి చీపుర్లుపట్టి నేతలు రోడ్లు శుభ్రం చేశారు.

స్వచ్ఛ బందరుకు కలిసి పనిచేద్దాం
చెరువు గట్టుపై ముళ్ల పొదలు తొలగిస్తున్న మంత్రి రవీంద్ర, కూటమి నేతలు

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఫొటోలకు ఫోజులిచ్చేవారు కాకుండా నిజంగా పనిచేసేవాళ్లు నాతో పనిచేసేందుకు రండి.. బంగారు, స్వచ్ఛ బందరుగా తీర్చిదిద్దుదాం.. అని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం మూడు స్తంభాల సెంటర్‌ నుంచి చీపుర్లుపట్టి నేతలు రోడ్లు శుభ్రం చేశారు. పంపులచెరువు గట్టుపై పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన శ్రమదాన కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జి సోడిశెట్టి బాలాజీ, కూటమి నేతలు కొట్టె వెంకట్రావు, మాదివాడ రాము, మోటమర్రి బాబాప్రసాద్‌, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, అన్నం ఆనంద్‌, ఎండీ ఇలియాస్‌, పిప్పళ్ల కాంతారావు, కుంచే నాని, గనిపిశెట్టి గోపాల్‌, పల్లపాటి సుబ్రహ్మణ్యం, మునిసిపల్‌ కమిషనరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. నగరంలో పారిశుధ్య కార్మికులతో కలిసి సమష్టిగా స్వచ్ఛ బందరు కార్యక్రమం చేపడతామన్నారు. జెడ్పీ సెంటర్‌ను శుభ్రం చేద్దామన్నారు. సీఎ్‌సఆర్‌ ఇతర నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రూ.100 కోట్లతో పార్కులు, డ్రెయిన్లు, స్మశాన వాటికలు శుభ్రం చేద్దామన్నారు. దారిధ్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.200లకే కుళాయి కనెక్షన్‌ అందిస్తున్నామన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

బాధితులకు అండగా ఉంటానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మంత్రి కార్యాలయంలో 14 మంది రోగులకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.29 లక్షల విలువగల చెక్కులను అందజేశారు. పేదల వైద్య సేవలకు అండగా ఉంటామన్నారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌, ఆసుపత్రిలో స్కానింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి..

బుడమేరు వరద బాధితులకు మునిసిపల్‌ కార్మికులు చేసిన సేవలు.. వారి కాళ్లు కడిగినా రుణం తీర్చుకోలేమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వరద బాధితులకు సేవలందించిన 250 మంది పారిశుధ్య కార్మికులకు ఆదివారం పంపింగ్‌ హౌస్‌ వద్ద రూ. 5లక్షల విలువ గల దుస్తులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 250 మంది మునిసిపల్‌ కార్మికులకు తనవంతుగా పాదరక్షలు అందిస్తానన్నారు. పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. డంపింగ్‌ యార్డులో లక్ష టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని, ఆరునెలల్లో ప్రత్యేక నిధులతో చెత్త సమస్యను తీరుస్తామన్నారు. సీఎం ఆదేశాలతో డంపింగ్‌ యార్డు స్థలంలో సుందరమైన పార్కు నిర్మిస్తామని, డంపింగ్‌ యార్డును రుద్రవరం తరలిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 01:08 AM