ఇసుక అందుబాటులో ఉంచండి
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:05 AM
ఇసుక క్వారీలను తక్షణమే తెరిపించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
విద్యాధరపురం, అక్టోబరు 1: ఇసుక క్వారీలను తక్షణమే తెరిపించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ), బిల్డింగ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం భవానీపురంలోని పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇసుక అందుబాటులో లేకపోవటంతో కార్మికులు పనులులేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇసుక అమ్మిన ధరకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అదనంగా రెండు వేల రూపాయలు భారం మోపిందన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ ఇంతవరకు ఇసుక అందుబాటులోకి రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లాలో ఇసుక రీచ్‌లన్నీ తెరిచి అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ప్రేమ ఇసుక విడుదల చేయటం పై లేకపోవటం బాధాకరమన్నారు. అనంతరం తహసీల్దార్ కార్మాలయంలో అడ్మిషన్ ఆఫీసర్ (ఏవో) శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు పెద్దిరాజు, షేక్ బాజీ, బ్రహ్మయ్య, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.