జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:24 AM
వరద, అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల రుణాలను పూర్తిగా రద్దుచేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చల్లపల్లి మండలం వెలివోలు, మంగళాపురం గ్రామాల్లో బుధవారం పర్యటించి వరదలు, వర్షాల కారణంగా నీటమునిగిన వాణిజ్య పంటలు, పట్టుపురుగుల షెడ్లు, పొలాలను పరిశీలించారు.
చల్లపల్లి, సెప్టెంబరు 11 : వరద, అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల రుణాలను పూర్తిగా రద్దుచేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చల్లపల్లి మండలం వెలివోలు, మంగళాపురం గ్రామాల్లో బుధవారం పర్యటించి వరదలు, వర్షాల కారణంగా నీటమునిగిన వాణిజ్య పంటలు, పట్టుపురుగుల షెడ్లు, పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, బుడమేరు పొంగి విజయవాడ నగరం ముంపునకు గురైతే, వరదలు, వర్షాల కారణంగా నదీపరీవాహక ప్రాంతాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంతటి ఘోరవిపత్తు సంభవించినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ జాతీయ విపత్తుగా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు. వెలివోలులో పట్టు రైతులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలనీ, ఒక్కొక్క షెడ్డుకు రూ.నాలుగు లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. తమ భూములు ఆన్‌లైన్ చేయలేదని రైతులు చెబుతున్నారనీ, భూపోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పంపిణీ జరిగిన భూములను ఇప్పటివరకు ఆన్‌లైన్ చేయకపోవటం అధికారుల తప్పిదం కాదా అని ప్రశ్నించారు. తక్షణమే భూములను ఆన్‌లైన్ చేయాలనీ, నిబంధనలు సడలించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. వరికి ఎకరాకు రూ.50వేలు, వాణిజ్య పంటలైన అరటి, కంద, పసుపు పంటలకు ఎకరాకు రూ. లక్ష పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరదలలో ఇప్పటి వరకు సుమారు 40 మంది చనిపోయారనీ, ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యలమందరావు, పరుచూరి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి టి.తాతయ్య, సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతుసంఘం నేతలు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, గుత్తికొండ రామారావు, వేమూరి రత్నగిరిరావు తదితరులు పాల్గొన్నారు.