Share News

శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:50 AM

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో గురువారం నుంచి జరగనున్న దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం
దసరా ఏర్పాట్లపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులతో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

వన్‌టౌన్‌, అక్టోబరు 1 : దుర్గామల్లేశ్వర దేవస్థానంలో గురువారం నుంచి జరగనున్న దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, గదె రామ్మోహనరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణ, కలెక్టర్‌ జి.సృజన, పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబు, దేవస్ధానం ఈవో కేఎస్‌ రామారావు, పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌, 13 శాఖల అధికారులు, ప్రతినిధులతో దసరా మహోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దసరా మహోత్సవాలను నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు, సమన్వయంతో విధులు నిర్వహిస్తారని తెలిపారు. వీవీఐపీలు టైమ్‌ స్లాట్‌లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం అమ్మవారికి స్నపన, అలంకార కార్యక్రమాలు ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సాయంత్రం 4 నుంచి 5 లోగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఎవరికీ అంతరాలయ దర్శనం లేదని స్పష్టం చేశారు. పదిరోజుల పాటు జరగనున్న దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. ఆలయ గోపురాలు, ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలతో, పూలమాలలతో అలంకరిస్తున్నట్టు తెలిపారు. సాయంసంధ్య వేళ కృష్ణవేణి నదీమ తల్లికి పూర్తి ఆధ్యాత్మిక సొబగులతో నవహారతుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 07:36 AM