ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:24 AM
రమేష్ ఆస్పత్రి జంక్షన్ నుంచి రామవరప్పాడు సెంటర్ వరకు ఏలూరు జాతీయ రహదారి వెంబడి ప్రధాన సెంటర్లలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద, ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రయాణికులు నిలబడేందుకు షెల్టర్లు లేవు. దీంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
బస్సుల కోసం ఎదురుచూపులు..రామవరప్పాడు రింగ్, ప్రభుత్వాస్పత్రి వద్ద షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
(ఆంధ్రజ్యోతి-గుణదల, భారతీనగర్)
రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండ డానికి బస్‌షెల్టర్ లేకపోవ డంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. నిత్యం కొన్ని వందలమంది ఇక్కడ ఆర్టీసీ బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. అలాంటి రద్దీ ప్రదేశంలోనూ బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేయకపోవడం దారుణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. తక్షణమే రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బస్‌షెల్టర్ ఏర్పాటు చేసి వృద్దులు కూర్చునేందుకు వీలుగా అందులో సిమెంట్ సప్టాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రభుత్వాస్పత్రి వద్ద పడిగాపులే..
మహానాడు జంక్షన్ సమీపంలోని ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద కూడా బస్ షెల్టర్ లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సు వచ్చే వరకు చెట్ల నీడలో ఉంటూ పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.