క్లాప్ బంద్!
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:04 AM
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు ఉపయోగించే క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాలు నిలిచిపోయాయి. క్లాప్ వాహన సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో క్లాప్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. అసలే డయేరియా భయంతో వణుకుతున్న ప్రజలకు చెత్తసేకరణ నిలిచిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
నగరాలు, పట్టణాల్లో నిలిచిన చెత్తసేకరణ
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 300కుపైగా క్లాప్ వాహనాలు
నిర్వహణ, సిబ్బంది జీతాల బాధ్యత ప్రైవేటు ఏజెన్సీకి
మూడు నెలలుగా జీతాలు చెల్లించని ఏజెన్సీ
విధులు బహిష్కరించిన క్లాప్ వాహన డ్రైవర్లు
వారం రోజులుగా ఇంటింటి చెత్త సేకరణ బంద్
పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్త
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు ఉపయోగించే క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) వాహనాలు నిలిచిపోయాయి. క్లాప్ వాహన సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో క్లాప్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. అసలే డయేరియా భయంతో వణుకుతున్న ప్రజలకు చెత్తసేకరణ నిలిచిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సీఎన్‌జీ వాహనాలను కేటాయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 225 వాహనాలు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు 42 వాహనాలు, గుడివాడ మున్సిపాలిటీకి 31 వాహనాలు, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీకి 42 వాహనాలు కేటాయించారు. ఈ వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేవారు. ఈ వాహన డ్రైవర్లకు జీతాల చెల్లింపు.. వాహనాల నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. క్లాప్ డ్రైవర్‌కు రూ.18,500 చొప్పున ప్రభుత్వం ఈ ఏజెన్సీకి చెల్లిస్తుంది. అయితే ఏజెన్సీ వారు మాత్రం డ్రైవర్లకు రూ.12,000 మాత్రమే చెల్లిస్తున్నారు. మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి తమకు బిల్లులు రాలేదంటూ ఏజెన్సీ వారు డ్రైవర్లకు జీతాల చెల్లింపును నిలిపివేశారు. 365 రోజులు పనిచేస్తున్నా జీతాల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ క్లాప్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. దీంతో గత వారం రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయింది.
ఎక్కడ చూసినా చెత్తే
విజయవాడ కార్పొరేషన్‌లో 225 వాహనాల నిర్వహణ, జీతాలకు ప్రతినెలా రూ.1.28 కోట్లు ఏజెన్సీకి చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) చెల్లిస్తుంది. గత కొంతకాలంగా విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్‌తోపాటు గుడివాడ, వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోనూ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో వాహన డ్రైవర్లు విధులు బహిష్కరించారు. విజయవాడ నగరంలో 225 వాహనాల ద్వారా ప్రతిరోజూ సుమారు 300 టన్నుల చెత్తను సేకరించి తరలిస్తారు. మచిలీపట్నంలో సుమారు 80 టన్నులు, గుడివాడ మున్సిపాలిటీలో 60 టన్నులు వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలో 30 టన్నుల వరకు చెత్తను సేకరిస్తారు. వారం రోజులుగా క్లాప్ వాహనాల డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో విజయవాడ నగరంలోనే సుమారు 500 టన్నులు, మిగిలిన పట్టణాల్లో సుమారు 200 టన్నుల వరకు చెత్త పేరుకుపోయింది.
అసలే డయేరియా.. ఆపై చెత్త సమస్య
కొన్ని రోజుల క్రితం వరకు ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లోని పలు ప్రాంతాల్లో డయేరియా ప్రజలను అల్లాడించింది. ఇప్పటికీ డయేరియా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెత్త సేకరణ నిలిచిపోవడం.. ఇళ్లలో చెత్త పేరుకుపోవడంతో పాటు వీధుల్లో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శన మిస్తు న్నాయి. అధికారులు తక్షణం స్పందించి చెత్తసేకరణ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
వీఎంసీలో 110 ట్రాక్టర్లు ఏర్పాటు
విజయవాడ నగరంలో క్లాప్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం 110 ట్రాక్టర్లను ఏర్పాటు చేసినట్లు వీఎంసీ అధికారులు తెలిపారు. వీఎంసీ టిప్పర్లు, ట్రాక్టర్లతో నగరంలో చెత్త సమస్య తలెత్తకుండా చూస్తున్నట్లు చెప్పారు. అయితే మచిలీపట్నం కార్పొరేషన్‌తోపాటు వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, గుడివాడ మున్సిపాలిటీలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయి.