Share News

దరఖాస్తుల వరద

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:37 AM

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. నష్టపోయిన లేదా దెబ్బతిన్న వాహనాలు, నివాసాలు, దుకాణాలు, చిన్న మధ్యతరహా వ్యాపార సముదాయాలకు సంబంధించిన బీమా క్లెయింలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నారు.

దరఖాస్తుల వరద
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్సూరెన్స్‌ క్లెయిం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ్చ

మూడు రోజుల్లో 5,151 దరఖాస్తులు

ఇన్సూరెన్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు క్యూ

407 క్లెయింలు పరిష్కరించి రూ.3.36 కోట్లు చెల్లింపు

మిగిలిన క్లెయింలూ 10 రోజుల్లో పరిష్కారం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. నష్టపోయిన లేదా దెబ్బతిన్న వాహనాలు, నివాసాలు, దుకాణాలు, చిన్న మధ్యతరహా వ్యాపార సముదాయాలకు సంబంధించిన బీమా క్లెయింలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నారు. ఇందుకోసం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఇన్సూరెన్స్‌ క్లెయిం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నిరంతరం శ్రమిస్తోంది. తక్షణమే క్లెయిం నమోదు చేసుకునేందుకు వాట్సాప్‌, టోల్‌ఫ్రీ నెంబరు, ఈ-మెయిల్‌, వెబ్‌సైట్‌ లేదా ఇతర మార్గాల ద్వారా అవకాశం కల్పించింది. ఈనెల 9న ప్రారంభమైన ఈ సెంటర్‌కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 5,151 క్లెయింలు నమోదు కాగా, వాటి విలువ రూ.182.76 కోట్లు. మూడు రోజుల్లో 407 క్లెయింలను పరిష్కరించి రూ.3.36 కోట్లను చెల్లించారు. ఇంకా 4,744 క్లెయింలను పరిష్కరించాల్సి ఉంది. వీటి విలువ రూ.179.40 కోట్లు. వచ్చిన క్లెయింల్లో మోటారు వాహనాలకు సంబంధించినవే 4,452 ఉన్నాయి. వీటి విలువ రూ.45.83 కోట్లు. వీటిలో 323 క్లెయింలను పరిష్కరించి రూ.94 లక్షలు చెల్లించారు. మోటారు వాహనాలకు సంబంధించినవి కాకుండా గృహోపకరణాలు, ఇంటి బీమాకు సంబంధించినవి 699 ఉన్నాయి. వీటి విలువ రూ.136.93 కోట్లు. వీటిలో 84 క్లెయింలు పరిష్కరించి రూ.2.42 కోట్లు చెల్లించారు.

అనుసంధానకర్తగా ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌

ఈనెల 9వ తేదీన ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్‌ క్లెయిం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 22 ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చారు. 15 కౌంటర్లలో సేవలందిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉండి బీమాదారు అంగీకరిస్తే అక్కడికక్కడే క్లెయింలు పరిష్కరిస్తున్నారు. సరైన పత్రాలు, ఫొటోలు లేకపోయినా క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లెయింలను పరిష్కరించేందుకు కాస్త సమయం తీసుకుంటున్నారు.

10 రోజుల్లో క్లెయింల పరిష్కారమే లక్ష్యం

వరద బాధితులకు ఇన్సూరెన్స్‌ క్లెయింల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. 10 రోజుల్లో క్లెయింలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సెంటర్‌ ఏర్పాటుచేసి మూడు రోజులవుతోంది. తొలిరోజు స్పందన లేదు. రెండు రోజులుగా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 5వేల పైచిలుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఒరిజినల్‌ పత్రాలు పోయినా జిరాక్స్‌తోనైనా క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

- ఎస్‌.సుజీత్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌

Updated Date - Sep 12 , 2024 | 12:37 AM