బ్యాంకర్లు సహకరించాలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:35 AM
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ ద్వారా వీలైనంత అధిక మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు బాధిత ప్రజలకు భరోసా కల్పించడంలో కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి (ఫైనాన్స్) జె.నివాస్, కలెక్టర్ సృజన కోరారు.
విజయవాడ లీగల్ : వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ ద్వారా వీలైనంత అధిక మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు బాధిత ప్రజలకు భరోసా కల్పించడంలో కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి (ఫైనాన్స్) జె.నివాస్, కలెక్టర్ సృజన కోరారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో వారు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వరద ప్రభావిత ప్రజలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన సహాయ సహకారాలకు ప్రతిపాదనల రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా నివాస్ మాట్లాడుతూ, వరద వల్ల నష్టపోయిన ప్రజలకు తగిన సహాయం అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. ఇందుకు ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. రుణాల రీషెడ్యూలింగ్, వినియోగ రుణాల్లో వెసులుబాటు, కొత్త రుణాల మంజూరుకు సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాల్లోని బ్యాంకుశాఖలు తమ పరిధిలో ఇప్పటికే వివిధ రకాల రుణాలు పొందినవారు, వినియోగ రుణాలు పొందిన వారు, రుణాల మొత్తం, రుణ ఖాతాలు, జరిగిన నష్టం విలువ తదితర వివరాలతో సమాచార నిధి (డేటా బేస్) రూపొందించాలని, ఇందుకు తమ సర్వేయర్స్, అసెసర్స్ వంటి ఫీల్డ్ సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా సమాచారం అందుబాటులో వుంటుందని, ఈ మొత్తం సమాచారాన్ని మదించి పునర్నిర్మాణ ప్యాకేజీపై ప్రతిపాదనలు రూపొందాల్సి వుందని నివాస్ వివరించారు.
సమష్టి భాగస్వామ్యంతో భరోసా..
కష్టాల్లో వున్నవారిని గట్టెక్కించడంలో ప్రభుత్వ యంత్రాంగంతో బ్యాంకులు కలిసి రావాలని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ముఖ్యమంత్రి బ్యాంకులు, బీమా సంస్థలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని, త్వరలో ఆయన అధ్యక్షతన మరో సమావేశం వుంటుందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎల్‌డీఎం కె.ప్రియాంక, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.