ఎదురెదురుగా ఢీకొన్న కార్లు తల్లీకుమారుడు దుర్మరణం
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:17 AM
ఎదురెదురుగా రెండు కారులు ఢీకొని తల్లీకొడుకు దుర్మరణం చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా గరికపాడు కేవీకే సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది.
తండ్రి, మరో కుమారుడికి గాయాలు
గరికపాడు కేవీకే సమీపంలో ఘటన
దుర్గమ్మను దర్శించుకుని హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
విశాఖపట్నం వాసులుగా గుర్తింపు
జగ్గయ్యపేట రూరల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా రెండు కారులు ఢీకొని తల్లీకొడుకు దుర్మరణం చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా గరికపాడు కేవీకే సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన ఇళ్ల నాగ వెంకట మల్లికార్జునరావు, బార్య నాగలక్ష్మి(55), కుమారులు శ్రీకాంత్(35), చైతన్యలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి రెండు రోజుల క్రితం విజయవాడలో బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనం చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును అదే మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శ్రీకాంత్, నాగలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. మల్లికార్జునరావు కుడికాలు విరిగిపోగా, చైతన్యకు స్వల్పగాయాల య్యాయి. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్సై శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను రోడ్డు పక్కకు నెట్టించి, మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభు త్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.