Share News

236 ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:45 AM

ఐదేళ్ల వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా తయారైన ‘మద్యం’ విధానంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన మద్యం పాలసీతో గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో వైసీసీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.

236 ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు

ఎన్టీఆర్‌లో 113.. కృష్ణాలో 123

మద్యం షాపులకు గెజిట్‌ విడుదల

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ

ఎక్సైజ్‌ స్టేషన్లలోనూ దరఖాస్తుకు అవకాశం

స్వీకరణకు ఈ నెల 9వ తేదీ తుది గడువు

ఐదేళ్ల వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా తయారైన ‘మద్యం’ విధానంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన మద్యం పాలసీతో గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో వైసీసీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. కొత్త ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించడంతో ఆ దుకాణాలు రద్దయ్యాయి. కొత్త పాలసీ ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇంతకుముందు విధంగానే దరఖాస్తులు స్వీకరించి, లాటరీ విధానంలో ఈ షాపులను కేటాయించనున్నారు.

(ఆంధ్రజ్యోతి - అమరావతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిర్ణయించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవి కాకుండా కల్లు గీత కార్మికులకు పది శాతం షాపులను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను రెండు జిల్లాల కలెక్టర్లు మంగళవారం విడుదల చేశారు. విజయవాడలో 39 షాపులు, మచిలీపట్నంలో ఐదు షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 74, కృష్ణాజిల్లా వ్యాప్తంగా 188 షాపులు ఏర్పాటు చేసుకునేలా గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. షాపులు ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారు మంగళవారం సాయంత్రం నుంచి ఆబ్కారీ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తును సమర్పించుకోవచ్చు. ఇది కాకుండా మాన్యువల్‌ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని ఎక్సైజ్‌ అధికారులు నిర్ణయించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎనిమిది ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. విజయవాడలో విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, భవానీపురం స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, నందిగామ, తిరువూరులో ఎక్సైజ్‌ స్టేషన్లు నడుస్తున్నాయి. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, బంటుమిల్లి, గన్నవరం, గుడివాడ, మొవ్వ, నందివాడలో స్టేషన్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించలేని వారు ఈ స్టేషన్లలో దరఖాస్తులను అందజేయవచ్చు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫీజుల చెల్లింపునకు మూడు శ్లాబ్‌లను నిర్ణయించారు.

రెండేళ్ల కాలపరిమితికి లైసెన్స్‌

అభ్యర్థులు దరఖాస్తుతోపాటు రూ.2లక్షల దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. షాపులకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు లాటరీ విధానంలో షాపులు కేటాయిస్తారు. అభ్యర్థులు తొమ్మిదో తేదీ సాయంత్ర ఐదు గంటల లోపు ఆన్‌లైన్‌లో గానీ, ఎక్సైజ్‌ స్టేషన్‌లో గానీ అందజేయాలి. పదో తేదీన అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. 11వ తేదీన జిల్లా కలెక్టర్ల సమక్షంలో షాపులు కేటాయిస్తారు. ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించిన షాపులకు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో లాటరీ తీస్తారు. ఎక్సైజ్‌ అధికారులు రెండు ఏళ్ల కాలపరిమితికి లైసెన్స్‌ ఇస్తారు. నిర్ణయించిన ఫీజు ఏడాది కాలానికే వర్తిస్తుంది. రెండో ఏడాది దీనికి పది శాతం ఫీజును పెంచుతారు.

ఫీజుల చెల్లింపునకు ఇలా మూడు శ్లాబ్‌లను నిర్ణయించారు.

జనాభా పరిధి చెల్లించాల్సిన ఫీజు

10,000 - 50,000 రూ.55 లక్షలు

50,000 - 5 లక్షలు రూ.65 లక్షలు

5 లక్షలు- ఆపైన రూ.85 లక్షలు

Updated Date - Oct 02 , 2024 | 07:48 AM