Share News

బోటు ఆపరేషన్‌లో ‘కావడి’

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:26 AM

గ్రామాల్లో బావులు, చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు పాత కాలంలో కావడి ఉపయోగించేవారు.

బోటు ఆపరేషన్‌లో ‘కావడి’

ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు లాగడానికి కొత్త ప్లాన్‌

రెండు కార్గో బోట్లకు ఇనుప గడ్డర్ల ఏర్పాటు

నేడు గొల్లపూడి వైపు లాక్కెళ్లే అవకాశం

విజయవాడ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో బావులు, చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు పాత కాలంలో కావడి ఉపయోగించేవారు. అంటే చెక్క బద్దకు ఇరు వైపులా వేలాడదీసిన తాళ్లకు బిందెలు కట్టుకుని నీళ్లు తెచ్చుకునేవారు. నాడు గ్రామాల్లో ఉపయోగించిన ఈ కావడి విధానాన్ని ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు ఆపరేషన్‌లో వాడాలని ఇంజనీరింగ్‌ నిపుణులు భావించారు. దీనికోసం దుర్గాఘాట్‌ చెంతనే పనులు చేపట్టారు. బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను ఒడ్డుకు చేర్చే క్రమంలో ఒక బోటు నీటిలో ముగినిగిపోయిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా 450 మీటర్ల ఇనుప రోప్‌ను అమర్చి మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి భారీ క్రేన్‌తో లాగుతున్నారు. ఆదివారం సాయంత్రానికి ఈ బోటు ఒక దశను దాటి మరో దశకు చేరుకుంది. బ్యారేజీ గేట్ల వెనుక భాగంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో బోటు త్వరగా ముందుకు రాలేదని గుర్తించారు. ఇప్పటి వరకు రాళ్లపై ఉన్న బోటు ఆదివారం మధ్యాహ్నానికి ఇసుక మేట వేసిన ప్రాంతానికి వచ్చింది. దీంతో క్రేన్‌ ఎలాంటి ఒత్తిడి, భారం లేకుండా బోటును సులువుగా ముందుకు లాగింది. బోటు ఇసుక ప్రదేశానికి చేరుకోవడంతో సులువుగా ముందుకు కదిలిందని అబ్బులు టీం గుర్తించింది.

క్రేన్‌ సహాయంతో మరింత ముందుకు లాక్కొచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ బోటుకు సమీపంలో బ్యారేజీ వెనుక నిర్మించిన సేఫ్టీ వాల్‌ ఉంది. బోటును ముందుకు లాగితే ఆ వాల్‌ దెబ్బతింటుంది. పైగా ఈ వాల్‌ను ఢీకొని ఆగిపోతే బోటును లాగడం సాధ్యం కాదని నిర్ధారించారు. నీటిలో మునిగిపోయి ఉన్న బోటు ఎలాంటి నష్టం లేకుండా ఒడ్డుకు చేర్చడానికి కావడి విధానమే మేలని అబ్బులు టీం భావించింది. ఈ ఆపరేషన్‌ కోసం రెండు కార్గో బోట్లను రప్పించారు. వాటిని దుర్గాఘాట్‌కు పక్కన నది ఒడ్డుకు తీసుకొచ్చి పక్కపక్కనే పెట్టి వాటి పైభాగాన టన్ను బరువు గల మూడు ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఈ గడ్డర్లకు పైభాగాన మూడేసి పెద్ద రంధ్రాలు ఉన్న హుక్‌లు పెట్టి వెల్డింగ్‌ చేశారు. సోమవారం ఉదయం ఒక బోటును బ్యారేజ్‌ గేట్ల వైపున, మరో బోటును నది వైపున నిలుపుతారు. విశాఖ సీ లయన్‌ కంపెనీ డైవర్లు నీళ్లలోకి దిగి మునిగిన బోటుకు రెండు వైపులా ఉండే రంధ్రాల్లో ఇనుప రోప్‌ను పెట్టి లాక్‌ చేస్తారు. ఈ రోప్‌లను గడ్డర్ల హుక్‌లకు బిగిస్తారు. తర్వాత గడ్డర్లు ఉన్న రెండు బోట్లు నెమ్మదిగా గొల్లపూడి వైపు కదులుతాయని ఇంజనీర్లు తెలిపారు.

అబ్బులు ఫోన్‌ చోరీ

రిగ్గింగ్‌లో ప్రావీణ్యం ఉన్న అబ్బులు టీమ్‌ బెకమ్‌ కంపెనీ నిపుణులతో కలిసి బోటు ఆపరేషన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఆయన ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాజేశారు. చార్జింగ్‌ పెట్టిన కాసేపటికి ఫోన్‌ కనిపించలేదు. మనస్తాపం చెందిన ఆయన ఆదివారం ఈ ఆపరేషన్‌లో కనిపించలేదు.

Updated Date - Sep 16 , 2024 | 03:26 AM