Share News

ఫైబర్‌ నెట్‌ ఈడీ జగన్మోహనరావుపై వేటు

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:27 AM

అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు, జీతభత్యాల ఖరారు.. మాస్టర్‌ డేటా మాయం వంటి ఆరోపణలతో ఏపీ ఫైబర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిళ్లా జగన్మోహనరావు సస్పెండ్‌ అయ్యారు.

ఫైబర్‌ నెట్‌ ఈడీ జగన్మోహనరావుపై వేటు

డేటా మాయం, నియామకాల్లో అవకతవకల వల్లే!

ఎండీ సిఫారసుకు ప్రభుత్వం ఆమోదం

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు, జీతభత్యాల ఖరారు.. మాస్టర్‌ డేటా మాయం వంటి ఆరోపణలతో ఏపీ ఫైబర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిళ్లా జగన్మోహనరావు సస్పెండ్‌ అయ్యారు. ఈడీగా ఆయన తీసుకున్న నిర్ణయాలు సంస్థకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని గుర్తించిన ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేశ్‌కుమార్‌ ఆయనను సస్పెండ్‌ చేయాలని ఆదివారం ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వరరెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఫారసు చేసిన వారందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశారు. ఈ నియామకాలు, జీతభత్యాల ఖరారులో పెద్ద కుంభకోణమే చోటు చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపైనా కూటమి సర్కారు వచ్చాక దర్యాప్తు చేస్తోంది. ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేసేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో.. 2019 నుంచి 2024 దాకా ఉన్న మాస్టర్‌ డేటాను పరిశీలించేందుకు ఎండీ దినేశ్‌ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మాస్టర్‌ డేటాను చెరిపేసినట్టు, దీనిలో గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారి హస్తమున్నట్టు గుర్తించారు. ఈడీ జగన్మోహనరావు తీసుకున్న నిర్ణయాలు సంస్థకు నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని గుర్తించిన ఎండీ ఆయనను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వానికి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దానికి ప్రభుత్వం కూడా ఓకే తెలిపింది.

Updated Date - Sep 16 , 2024 | 03:29 AM