రూ.కోటి మాటలు చెప్పి ఇలాగేనా సాయం జగన్?
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:52 AM
విజయవాడలోని వరద ప్రాంత బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. దానిని ఎలా వినియోగించేదీ చెప్పలేదు. బుధవారం మాత్రం రెండు వ్యాన్లలో పాలప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లతో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,
పాలు, వాటర్ బాటిళ్లతో మల్లాది, వెల్లంపల్లి
మధ్యాహ్నం తర్వాత రెండు వ్యాన్లతో హడావుడి
వాటి వంక కూడా చూడని వరద బాధితులు
అధినేత ఆదేశించినా విజయవాడ ముఖ్యనేతలంతా దూరం
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని వరద ప్రాంత బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. దానిని ఎలా వినియోగించేదీ చెప్పలేదు. బుధవారం మాత్రం రెండు వ్యాన్లలో పాలప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లతో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు వరద ప్రాంతాల్లో హడావుడి చేశారు. మధ్యాహ్నం రెండు గంటలు దాటాక తీసుకువచ్చిన పాలూ .. వాటర్ బాటిళ్ల వంక బాధితులు కన్నెత్తి కూడా చూడలేదు. సాయం చేయాలన్నా ఒక సమయం ఉంటుందని, మిట్టమధ్యాహ్నం దాటక పాలు తీసుకువస్తే ఎవరు తీసుకుంటారని పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. బయట గంటసేపు ఉంటే పాలు విరిగిపోతాయని, అవి ఎందుకూ పనికిరాకుండా పాడై పోతాయని వారికి తెలిపారు. ప్రధాన రహదారిలో కాకుండా సందుల్లోకి వెళ్లి ఇస్తామంటూ ఒక జేసీబీ లోకి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను ఎత్తారు. అయినా, వాటిని పంచుతారా అని కూడా ఎవరూ అడగలేదు. దీంతో అక్కడక్కడ కొన్ని పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేసి వారు వెనుదిరిగారు. మరోవైపు మల్లాది, వెల్లంపల్లి వెంట విజయవాడకు చెందిన వైసీపీ ముఖ్య నేతలెవరూ లేరు. పట్టుమని పదిమంది కూడా కార్యకర్తలు కనిపించలేదు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. అక్కడే తన వరద విరాళం ఆయన ప్రకటించారు. ఆ విరాళాన్ని ఎలా వినియోగించాలనేది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మెలిక పెట్టారు. వరద బాధితులకు సాయమందించాలని అదే సమావేశంలో జగన్ ఆదేశించారు. కానీ, వరద నష్టం ఎక్కువగా చోటుచేసుకున్న విజయవాడలోనూ అక్కడి స్థానిక ముఖ్యనేతలెవరూ... మల్లాది, వెల్లంపల్లి వెంట కనిపించకపోవడం గమనార్హం. హాజరయినవారిలో విజయవాడ నుంచి వారిద్దరు మాత్రమే ఉన్నారు. విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన కేశినేని నాని ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీ చేసిన దేవినేని అవినాశ్ సహా నేతలెవరూ రాలేదు.