ప్రేమోన్మాది అరెస్టు
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:21 AM
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని(16) ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది.
మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు
24 గంటల్లోనే అదుపులోకి.. రిమాండుకు తరలింపు
ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన ఇంటర్ విద్యార్థిని
నిందితుడిని ఉరి తీయాలి: బాధితురాలి తల్లిదండ్రులు
పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!
పథకం ప్రకారమే దారుణం: ఎస్పీ
కడప క్రైం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని(16) ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. శనివారం కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై నిందితుడు విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 80 శాతం గాయాలైన బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలించగా అర్ధరాత్రి 2.30 గంటలకు మరణించింది. నిందితుడు విఘ్నేశ్ ను 24 గంటల్లోనే అరెస్టు చేశామని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలని బాలిక కోరడంతోనే పథకం ప్రకారం విఘ్నేశ్ ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. విఘ్నేశ్ ఇంటి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోందని, ఐదేళ్ల నుంచి బాలికతో విఘ్నేశ్‌కు పరిచయం ఉందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఇరువురు విడిపోయారని, నిందితుడు ఆరు నెలల క్రితం మరో యువతిని ప్రేమపెళ్లి చేసుకున్నాడని తెలిపారు. శుక్రవారం రాత్రి బాలికకు ఫోన్ చేసి కలవాలని ఉందని, నువ్వు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, దీంతో బాలిక శనివారం బద్వేలు టౌన్‌కు వచ్చిందని వెల్లడించారు. ముందే పథకం రచించుకున్న విఘ్నేశ్.. బ్యాగులో పెట్రోల్ బాటిల్ పెట్టుకుని వచ్చాడని, ఇద్దరూ ఆటోలో సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపానికి వెళ్లారని, అక్కడ ఆటో దిగి అడవిలోకి వెళ్లారని, తరువాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. తనను కూడా పెళ్లి చేసుకోవాలని బాలిక కోరడంతో నిందితుడు ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలతో గాలించి ఆదివారం మధ్యాహ్నం కడప డీటీసీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని చెప్పారు. నిందితుడు ఉపయోగించిన బాటిల్, లైటరు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా.. అల్లారుముద్దుగా పెంచుకుని, ఉన్నత చదువులు చదివించాలనుకున్న తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడినప్పుడే తమ కుమార్తె ఆత్మ శాంతిస్తుందంటూ విలపించారు.