వదలని వానలు
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:11 AM
కోస్తా జిల్లాలను వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు రోజులు విరామం ఇచ్చినట్టే ఇచ్చి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.
నేడు అల్పపీడనం.. కోస్తాలో పలుచోట్ల వర్షాలు
గుంటూరు నుంచి విశాఖ వరకూ భారీ వర్షసూచన
నాలుగైదు రోజులపాటు కొనసాగే అవకాశం
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కోస్తా జిల్లాలను వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు రోజులు విరామం ఇచ్చినట్టే ఇచ్చి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఇంకా కోలుకోలేని గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అనేకచోట్ల బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి. మరో నాలుగైదు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చురుగ్గా రుతుపవనాలు..
రుతుపవన ద్రోణి తూర్పుభాగం రామగుండం, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇంకా కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ.ల నుంచి 7.6 కి.మీ. ఎత్తు మధ్యన ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాకుండా దాని నైరుతి భాగం ఒంగి ఉంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది ఉత్తర వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి ఏలూరు, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.08లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.