హోర్డింగ్స్, ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందే
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:16 AM
రాష్ట్రంలో విచ్చలవిడిగా వెలుస్తున్న హోర్డింగ్స్, ఫ్లెక్సీ బ్యానర్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రోడ్ల పక్కన, వీధి దీపాల స్తంభాలకు విచ్చలవిడిగా కడుతున్నారు: హైకోర్టు
అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వివరాలూ సమర్పించండి
రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విచ్చలవిడిగా వెలుస్తున్న హోర్డింగ్స్, ఫ్లెక్సీ బ్యానర్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నగరాలు, పట్టణాలు ఉన్నది హోర్డింగ్స్ ఏర్పాటు చేయడానికి కాదని వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన రోడ్ల పక్కన, వీధి దీపాల స్తంభాలకు హోర్డింగ్స్ కడుతున్నారని.. రాకపోకలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీల నాయకులే కాకుండా ప్రైవేటు వ్యక్తులు సైతం అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది. చట్టవిరుద్ధంగా వీటిని పెడుతుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. వాటిని తొలగించాల్సిన బాధ్యత వారిది కాదా అని నిలదీసింది. రాష్ట్రంలోని ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవి హోర్డింగ్స్ ఏర్పాటుకు ఎంత మందికి అనుమతులు ఇచ్చాయి.. అనధికారికంగా ఎంతమంది పెట్టారు.. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు తదితర అంశాలపై వివరణ కోరతామని తెలిపారు. ఆ వివరణను పరిశీలించిన అనంతరం తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా(అమికస్ క్యూరీ)గా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్‌ను నియమించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనధికారిక హోర్డింగ్స్, బ్యానర్లను అధికారులు తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి 2018లో దాఖలు చేసిన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.