అడ్మిషన్‌కోసం వెళ్తూ... వరదకు బలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:17 AM
ఉన్నత విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ విద్యార్థి నిండు ప్రాణం తీసింది. ఓవైపు వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ఆ శాఖ అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ విద్యార్థి నిండు ప్రాణం తీసింది. ఓవైపు వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ఆ శాఖ అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యమే ఓ విద్యార్థి మృత్యువాత పడటానికి కారణమైంది. డిగ్రీ అడ్మిషన్ల రెండో విడతలో భాగంగా ఆగస్టు 29న సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 3లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని నిర్దేశించారు. అయితే, 31 నుంచి రాష్ట్రంలో భారీవర్షాలు కురిశాయి. బుడమేరు కారణంగా విజయవాడను వరద ముంచెత్తింది. కానీ, ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించి కనీసం సెలవులపై ప్రకటన కూడా చేయలేదు. దీంతో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు 3లోగా తప్పనిసరిగా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి వచ్చింది. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన విద్యార్థి కొడాలి యశ్వంత్‌కుమార్(19)కి వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో అడ్మిషన్ లభించింది. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీలో రిపోర్టు చేసేందుకు మంగళవారం అక్కడక్కడా పడవల సాయం తీసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థి చివరికి గల్లంతయ్యాడు. బుధవారం యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. ఉన్నత విద్యాశాఖలో ఏ ఒక్కరైనా స్పందించి.. డిగ్రీ అడ్మిషన్లపై ప్రకటన చేసి ఉంటే విద్యార్థి ప్రాణాలు పోయేవి కావని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.