Share News

రూ.7,000 కోట్లు తక్షణమే ఇవ్వండి

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:48 AM

పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్‌, దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది.

రూ.7,000 కోట్లు తక్షణమే ఇవ్వండి

పోలవరంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాపన సిద్ధం

డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు మేఘాకే

జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ మెమో జారీ

ఈ రెండు పనులూ సమాంతరంగానే

తద్వారా రెండు సీజన్లు కలిసొచ్చే చాన్సు

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్‌, దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది. ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు రూ.12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది. 2025 మార్చిదాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పంపనుంది. కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. ఇంకోవైపు.. ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం.. కొత్త వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబరు నుంచే మొదలుపెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. కొత్త టెండర్లకు వెళ్లకుండా.. ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబరు నుంచి కొత్త వాల్‌ నిర్మాణ పనులు చేస్తూనే.. దానిపై సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం కూడా కట్టడం వల్ల రెండు సీజన్లు కలిసొస్తాయని.. ఏడాదిన్నరలోనే ఈ రెండు కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తోంది. జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలిదశ పూర్తికావాలని లక్ష్యం విధించింది.

ఆదిమూలం పిటిషన్‌ను తగిన బెంచ్‌ ముందు ఉంచండి

రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపుల ఆరోపణలతో తిరుపతి ఈస్ట్‌ పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచి సాధ్యమైనంత త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను రోస్టర్‌ ప్రకారం మరో బెంచ్‌ విచారించాల్సి ఉందని తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 03:48 AM