Share News

ఉద్యోగులమా? బానిసలమా?

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:36 AM

ద్యోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తీసుకు వచ్చిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌).

ఉద్యోగులమా? బానిసలమా?

ఈహెచ్‌ఎస్‌ను బాగుచేయరా

ఇప్పటికీ 18 ఏళ్లనాటిసీలింగ్‌

ఐదేళ్లనాటి ధరలే వర్తింపు

పెరిగిపోతున్న వైద్య ఖర్చులు

సొంత సొమ్ము చెల్లించేందుకు

డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వరు

డిశ్చార్జి అయ్యాక ఆ అరకొర

బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరగాలి

ఉద్యోగుల మండిపాటు

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తీసుకు వచ్చిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌). అయితే, ఇది ఇప్పటికీ 18 ఏళ్ల నాటి సీలింగ్‌ రేట్లతో నడుస్తోంది. 18 ఏళ్లలో వైద్యం ఖర్చులు ఎంత పెరిగాయో తెలిసిందే. అలాగే, వైద్య చికిత్సల ప్యాకేజీలను చంద్రబాబు హయాంలో(2018) పెంచారు. అప్పటి నుంచి ఈనాటి వరకు వైసీపీ ప్రభుత్వం తిరిగి దానివైపు చూడలేదు. ముఖ్యంగా కరోనా సమయంలో ఉద్యోగులు ప్రభుత్వం నుంచి సాయమందక, ఖరీదైన వైద్య ఖర్చులు భరించలేక, సరైన వైద్యమందక ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ సమయంలో చికిత్స ఖర్చుల కోసం తీసుకున్న రుణాలకు ఉద్యోగులు ఇంకా ఈఎంఐలు కడుతున్నారు. డిశ్చార్జి అయ్యాక ప్రభుత్వం ఇచ్చే అరకొర బిల్లుల కోసం ఆర్థికశాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యోగులమా? బానిసలమా? అర్థం కావట్లేదని, హెల్త్‌కార్డులు అప్‌డేట్‌ చేయడం చిన్నపనే అయినప్పటికీ ప్రభుత్వం తమను బానిసలుగా చూస్తున్నందునే ఆ పని చేయడం లేదని మండిపడ్డారు.

2005 సీలింగ్‌.. 2018 నాటి ప్యాకేజీలు

2005 నుంచి ఉద్యోగులు రాతపూర్వక ఫైళ్ల నుంచి కంప్యూటర్‌ ఫైళ్లు, ఇప్పుడు ఈ-ఆఫీస్‌ ఫైళ్ల వరకు వచ్చారు. కానీ, వారి ఈహెచ్‌ఎస్‌ సీలింగ్‌లో మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కింద 2005లో గరిష్ఠంగా రూ.2 లక్షల సీలింగ్‌ నిర్ణయించింది. ఇప్పటి వరకు అదే సీలింగ్‌ కొనసాగుతోంది. అలాగే, 2018లో వివిధ చికిత్సల ఽధరలు(ప్యాకేజీ) పెంచారు. అవి కూడా అలానే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, నార్మల్‌ డెలివరీ అయినా, సిజేరియన్‌ అయినా ఈ ప్యాకేజీలో ఇచ్చేది రూ.19,000 మాత్రమే. కానీ, బయట సాధారణ ఆస్పత్రుల్లో డెలివరీ ప్యాకేజీలు రూ.50,000పైనే ఉన్నాయి. ప్రస్తుతం బైపాస్‌ సర్జరీలు, స్టంట్‌ వేయడం కామన్‌ అయిపోయాయి. స్టంట్‌ వేసినందుకు ఆస్పత్రి ఫీజు ఎంత వేసినా సరే ప్రభుత్వం మాత్రం రూ.35,000 మాత్రమే ఇస్తోంది. మిగిలిన అన్ని చికిత్సలకు కూడా ప్రభుత్వం ఇచ్చేది అరకొరే.

వాటా ఎగ్గొడుతున్న ప్రభుత్వం

ఈహెచ్‌ఎస్‌ పథకం కోసం గజిటెడ్‌ ఉద్యోగుల వేతనం నుంచి రూ.300, నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగుల వేతనం నుంచి రూ.225 కట్‌ చేస్తున్నారు. ఇవి మొత్తం ఏడాదికి రూ.140 కోట్లు అవుతున్నాయి. ఇంతేమొత్తంలో ప్రభుత్వం తన వాటా కలపాలి. దీంతో ఈహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కింద రూ.280 కోట్ల నిధులు జమ కావాలి. కానీ, ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, క్యాష్‌లెస్‌ ద్వారా ఈ పథకం కింద అందుతున్న ప్రయోజనాలు పరిశీలిస్తే ప్రభుత్వం తన వాటా కలపకుండా ఎగ్గొడుతున్నట్టు అర్థమవుతోంది. 2022-23లో క్యాష్‌లెస్‌ కింద ప్రభుత్వం రూ.130 కోట్లు ఇచ్చింది. రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.20 కోట్లు ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా క్యాష్‌లెస్‌ కింద రూ.130 కోట్లు, రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.25 కోట్లు ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల జీతాల్లో నుంచి కట్‌ చేస్తున్న రూ.140 కోట్లనే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.140 కోట్లను ఉద్యోగుల కోసం ఉపయోగించడం లేదు. పోనీ ఉద్యోగులు సొంత డబ్బులతో కట్టుకుందామన్నా డీఏ, పీఆర్సీ బకాయిలు, సరెండర్‌ లీవులు, ఈఎల్స్‌, ఇతర బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

అప్పుడు రిటైర్మెంట్‌.. ఇప్పుడు జీఎల్‌ఐ

ఉద్యోగులకి డబ్బులిచ్చే ఏ అంశాన్నుంచైనా ప్రభుత్వం తెలివిగా పక్కకు తప్పుకొంటోంది. రిటైర్‌ అవుతున్న ఉద్యోగులకు ప్రయోజనాల రూపంలో డబ్బులివ్వాల్సి వస్తోందని రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు ఏపీజీఎల్‌ఐ క్లెయిమ్‌లు పెరిగిపోవడంతో వాటిని తీసుకోవడమే ఆపేశారు. ఈ క్లెయిమ్‌లు స్వీకరించడానికి ఒక ఆన్‌లైన్‌ యాప్‌ డెవలప్‌ చేస్తున్నామంటూ 8 నెలలుగా కాలయాపన చేస్తోంది. క్లెయిమ్‌లు తీసుకుంటే ఉద్యోగులకు డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

Updated Date - Feb 13 , 2024 | 02:36 AM