Share News

భారతీయ భాషల పునరుజ్జీవానికి కృషి

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:25 AM

భారతీయ భాషల పునరుజ్జీవానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం(వీఎ్‌సయూ) ఉపకులపతి ఆచార్య సారంగం విజయభాస్కర్‌రావు అన్నారు.

భారతీయ భాషల పునరుజ్జీవానికి కృషి

వీఎ్‌సయూ వీసీ విజయభాస్కర్‌రావు వెల్లడి

నెల్లూరులో అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్‌

నెల్లూరు(విద్య), అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): భారతీయ భాషల పునరుజ్జీవానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం(వీఎ్‌సయూ) ఉపకులపతి ఆచార్య సారంగం విజయభాస్కర్‌రావు అన్నారు. నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్‌ జాతీయ సభ 33వ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. భోపాల్‌ కేంద్రంగా పనిచేసే అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్‌ సంస్థ భాషల పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పలు భాషలు అంతరించిపోతున్న దశలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. తాము కూడా విశ్వవిద్యాలయం తరఫున ప్రోత్సాహం అందించి అనువాద రచనలు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. డీకే కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గిరి మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్‌ సంస్థ ఏపీ అధ్యక్షుడు పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమం ఆధిపత్యంతో భారతీయ భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు భారతీయ భాషలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన వార్షిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది సాహితీవేత్తలకు సమన్వయశ్రీ, సాహిత్యశ్రీ, సంస్కృతి భూషణ్‌, భారత్‌ భాషా భూషణ్‌, సరస్వతీ సమ్మాన్‌, రాష్ట్ర భాషా గౌరవ్‌ సమ్మాన్‌ పురస్కారాలను అందజేశారు.

Updated Date - Oct 21 , 2024 | 03:25 AM