తుఫాన్ అలజడి!
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:33 AM
ఫెంగల్ తుఫాన్ అలజడి.. అన్నదాతల్లో బెంగ తెచ్చింది.. ఏ క్షణం ఎటువంటి కష్టం వస్తుందోనని ఆందోళన చెందుతున్నాడు..
ఈసారీ వదలని వాతావరణం
ముంచుకొచ్చిన ఫెంగల్
అన్నదాతకు మళ్లీ కష్టాలు
చిరుజల్లులతో ఆందోళన
రైతుల ఉరుకులు..పరుగులు
కోనసీమలో అక్కడక్కడా వాన
తూర్పును భయపెట్టిన వరుణుడు
కాకినాడలో చెలరేగిన అలజడి
ఉదయం నుంచి వీడని మబ్బు
పచ్చిధాన్యమూ కొనుగోలు
మూడు రోజులు కోతలకు బ్రేక్
ఫెంగల్ తుఫాన్ అలజడి.. అన్నదాతల్లో బెంగ తెచ్చింది.. ఏ క్షణం ఎటువంటి కష్టం వస్తుందోనని ఆందోళన చెందుతున్నాడు.. ప్రతి ఏడాది ప్రకృతి అన్నదాతను వదలడంలేదు.. ఏదో ఒక విధంగా నష్టాల బాట పట్టిస్తూనే ఉంది.. ఈ ఏడాది ఏం భయం లేదనుకుంటే ఫెంగల్ తుఫాన్ వచ్చేసింది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా మాసూళ్లు సాగుతూనే ఉన్నాయి. దీంతో రైతుల్లో అలజడి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందేసరికి వాతావరణంలో వచ్చిన మార్పులతో అన్న దాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది పంటలు బాగానే పండాయని సంతోషంలో ఉన్న రైతులను ఫెంగల్ తుఫాన్ ఉరుకులు.. పరుగులు పెట్టిస్తోంది... మరోవైపు సముద్రంలోనూ అలల తాకిడి పెరిగింది.. పరీవాహక ప్రాంత ప్రజలను భయపెడుతోంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ భయ పెడుతోంది..అకాల కష్టం అన్నదాతను ఆం దోళనకు గురిచేస్తోంది.. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది.. తుఫా న్ తీరం దాటినా భయం మాత్రం వీడడం లేదు. ఏ క్షణం ఎలా ఉంటుందోనని ఆందో ళన చెందుతున్నారు. చాలా గ్రామాల్లో పం ట కోత దశలో ఉంది. కొన్ని చోట్ల పనల మీద, కుప్పలుగా ఏర్పడి ఉంది. పనలపై ఉన్న పంటను కుప్పలుగా వేసి టార్ఫా లిన్లు కప్పుతున్నారు. మరోవైపు పచ్చి మీద ఉన్న పంటను కుప్పలుగా వేస్తే ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పు లు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. తుఫాన్ ప్రభావం కార ణంగా వీచిన గాలులకు చాలా గ్రామాల్లో చేలు నేలవాలాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో మబ్బులతోపాటు అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి. దీంతో రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణం మార్పుతో రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
తూర్పున ఉరుకులు.. పరుగులు
రాజమహేంద్రవరం/గోకవరం/కడియం/సీతానగరం/ఉండ్రాజవరం/పెరవలి/దేవరపల్లి/ గోపాలపురం,నవంబరు30(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో జిల్లా ఓ మోస్తరు వానతో పాటు చలిగాలులు వీచాయి. పొలాల్లోనే ధాన్యం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు.మరో వైపు జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోతున్నారు. జిల్లాలో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 49,583 హెక్టార్లలో వరి మాసూళ్లు చేయగా 3,22,855 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రోజుకు సరాసరి 1240 హెక్టార్లలో మాసూళ్లు జరుగుతున్నాయి. ఇంకా కళ్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండి పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 30 వేల టన్నుల ధాన్యం కళ్లాలు, రోడ్లమీదే ఉంది. రాజమండ్రి రూరల్ మండలంలో 30 టన్నులు, కడియంలో 800 టన్నులు, రాజానగరంలో 1400, అనపర్తిలో 2300, బిక్కవోలులో 2800, కోరుకొండలో 1500, గోకవ రంలో 1800, సీతానగరంలో 1400, రంగంపేటలో 1232, చాగల్లులో 1900, దేవరపల్లిలో 1400, గోపాలపురంలో 1400, కొవ్వూరులో 2138 టన్నులు, నిడద వోలులో 1900, పెరవలిలో 2100, తాళ్ల పూడిలో 2200 టన్నులు, నల్లజర్లలో 1800 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉంది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవా లని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం టి.రాధిక పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో పర్యటించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులకు సూచించారు.
కోనసీమలో కంగారు
అమలాపురం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో గత 24 గంటల నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అన్నదాతలకు వర్షం కారణంగా కష్టాలు ఎదురయ్యాయి. మాసూళ్లు పూర్తికాకపోవడంతో వరి చేలల్లోనే పంట ఉండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిసి ముద్దవుతుండడం వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తూనే ఉంది. వరిచేలల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని సంరక్షించుకునే పనిలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. కొందరు రైతులు అతికష్టం మీద ధాన్యాన్నిరైసు మిల్లులకు తరలిస్తున్నారు. కొన్నిచోట్ల మిల్లుల్లో ధాన్యం తీసుకునేందుకు నిరాకరిస్తున్నందున రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం రాత్రికి తుఫాన్ తీరం దాటితే వర్షాలు కురుస్తాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కోతలు పూర్తయిన పంటను మిల్లులకు తరలించేలా అధికారులు, మిల్లర్లు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. అవసరమైన మేరకు రైతులకు త్వరగా టార్ఫాలిన్లు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు తమ సమస్యలను కంట్రోల్ రూము సెల్ 8309432487, 9441692275కు సమాచారం అందిస్తే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. తుఫాన్ నేపథ్యంలో రైతులు మరో మూడు రోజులపాటు వరికోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,18,559 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. కోతలు పూర్తి అయి 14,417 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి రూ.252 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
కాకినాడలో కలవరం
పిఠాపురం/సామర్లకోట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారిన నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి వాతావర ణం మారిపోయింది. రోజంతా ఆకాశం మేఘావృతమై వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యలో రెండు, మూడుసార్లు స్వల్పంగా వర్షం కురిసింది. కాకినాడ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు, పీబీసీ ఆయకట్టుతోపాటు మెట్ట ప్రాంతాల్లో కోతలకు సిద్ధంగా వరిపంట పలుచోట్ల నేలకొరిగింది. మాసూళ్లు జరిగిన ప్రాంతాల్లో అక్కడక్కడ ధాన్యం రాశులు కళ్లాల్లో ఉండి పోయాయి. ఈ ధాన్యాన్ని వర్షానికి తడవకుండా టార్ఫాలిన్లు, బరకాలు కప్పి నీరు నిలవకుండా రైతులు బాటలు తీస్తున్నారు. తుఫాను ప్రభావం జిల్లాపై అంతగా ఉండదని వాతావరణశాఖ చెప్పినా అందుకు భిన్నంగా ఎక్కువగా ఉండ డం రైతులను కలవరానికి గురిచేస్తోంది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం లేకుండా ఉంటే నష్టం జరగకుండా గట్టెక్కుతామని రైతులు ఆశిస్తున్నారు. అలాగే కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులను భద్రపరుచుకునేందుకు ప్రభుత్వం టార్ఫాలిన్లు, బరకాలు సరఫరా చేస్తే రైతులను కొంతమేర ఆదుకున్నట్టు అవుతుందని సామ ర్లకోట ప్రాంతంలోని రైతులు చెబుతున్నారు.
భయం గుప్పిట తీరం
కొత్తపల్లి/అమలాపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్ప డిన ఫెంగల్ తుఫాను తీరం దాటినా ఉప్పాడ తీరంలో సముద్రం తీవ్ర స్థాయిలో ఎగిసిపడు తోంది. శనివారం ఉదయం నుంచీ తీరం వెం బడి బలమైన ఈదురు గాలులతో పాటు వర్షం కురుస్తోంది. సముద్రం ఉప్పొంగుతూ మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో కెరటాలు ఒడ్డుకు దూసుకొస్తున్నాయి. ఉప్పాడ శివారు మాయాపట్నం, సూరాడపేట, కొత్తప ట్నం, సుబ్బంపేట గ్రామాల్లో ఒడ్డునే ఉన్న మత్య్యకారుల ఇళ్లల్లోకి అలలు పోటెత్తు తున్నా యి.ఇప్పటికే నాలుగు మత్స్యకారుల ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోగా, మరికొన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో కోత ఎక్కువగా ఉండి సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. ఫలితంగా సముద్రం చెంతనే ఉన్న సముద్ర రిసార్ట్స్ కోతకు గురయ్యే ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పక్కనే ఉన్న ఓఎన్జీసీ ప్లాంట్‌ను సముద్ర కెరటాలు తాకుతున్నాయి. మరో 48 గంటల పాటు వాతావరణం అనుకూలించే అవకాశం లేక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
పచ్చిధాన్యం కొనుగోలు
తుఫాన్ కారణంగా తేమశాతం 25 (తాజాగా నిర్ణయించింది) వచ్చేవరకు ఆరబెట్టుకునే అవకాశం రైతులకు లేనం దున పంట చేలో ధాన్యం కోసిన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్టు సమాచారం. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గిట్టుబాటు ధర మాత్రం ఇవ్వడం లేదు. కాటాకు రూ.1500 వరకు మాత్రమే రైతులకు గిడుతోంది. దీని వల్ల కాటాకు రూ.250 నుంచి రూ. 300 వందల వరకు రైతులు నష్టపోతున్నారు. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాటాకు రూ.1750 చొప్పున జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలకే రైతుల ఖాతాల్లోకి సొమ్ములు పడుతున్నాయి.