రెవెన్యూ గ్రామసభను బహిష్కరించిన రైతులు
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:36 AM
మం డల ప్రధాన కేంద్రమైన కోరుకొండ గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవె న్యూ గ్రామసభను రైతులు ఏకగ్రీవంగా బహిష్కరించారు.
తమ భూముల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించాలని డిమాండ్
ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరసన.. రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
కోరుకొండ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మం డల ప్రధాన కేంద్రమైన కోరుకొండ గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవె న్యూ గ్రామసభను రైతులు ఏకగ్రీవంగా బహిష్కరించారు. గ్రామసభకు పెద్దఎత్తున హాజరైన రైతులు 2014 నుంచి ఆగిపోయిన కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధి కారికి విన్నవించారు. శనివారం కోరుకొండగ్రామ పంచాయతీవద్ద రెవెన్యూసభ ప్రారంభమైన వెం టనే కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్‌పై రైతుల పక్షాన బాధిత గ్రామస్తుడు డాక్టర్ కుంచే వెంకటరమణ సమస్యను సభ దృష్టికి తీసుకొచ్చారు. పదేళ్లుగా కోరుకొండలో భూములకు, ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం నిలిపివేయడంవల్ల గ్రామంలో క్రయ, విక్రయాలు నిలిచిపోయాయన్నారు. దశాబ్ధకాలంగా కోరుకొండ రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. భూములు, ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేక తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసుకోలేక, మగపిల్లలను చదివించుకోలేక బ్యాంకుల్లో అప్పుపట్టుక నానా అవస్ధలు పడుతున్నామన్నారు. గత పదేళ్లలో అనేక మందిప్రజాప్రతినిధులను, అధి కారులను కలిసి తమ బాధ చెప్పుకున్నా తమ సమస్య పరిష్కరించలేదన్నారు. కోరుకొండ రైతుల పక్షాన డాక్టర్ కుంచే వెంకటరమణ గ్రామసభకు హాజరైన రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారికి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. గ్రామసభ నుంచి బయటకు వచ్చిన వందలాది మంది రైతులు శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆర్చ్ వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటకుపైగా రాస్తారోకో నిర్వహించా రు. దీంతో గోకవరం వైపు, రాజమహేంద్రవరం వైపు శ్రీరంగపట్నం, నర్సాపురం రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కోరుకొండ పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి పంపిం చేసి ట్రాఫిక్ పునరుద్ధరించారు. రెవెన్యూ గ్రామసభలో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారితోపాటు కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, సర్పంచ్ కర్రి లక్ష్మిసరోజ పాల్గొన్నారు.