మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ విజేతలు కర్నాటక క్రీడాకారులు
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:54 AM
రాజమహేంద్రవరంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. బుధవారం జరిగిన ఫైనల్స్‌లో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్‌లో కర్నాటక క్రీడాకారులు విజేతులుగా నిలిచారు.
బాలికల సింగిల్స్ అండర్ - 19 విజేత ఏపీ
ముగిసిన సౌత్‌జోన్ ఇంటర్‌స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలు
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 11 : రాజమహేంద్రవరంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. బుధవారం జరిగిన ఫైనల్స్‌లో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్‌లో కర్నాటక క్రీడాకారులు విజేతులుగా నిలిచారు. మెన్స్ విభాగంలో కర్నాటకు చెందిన తుషార్ సువీర్ తమిళనాడుకు చెందిన కిషోర్.ఎస్ పై 21-17, 21-17 స్కోర్లు తేడాతో గెలుపొందాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో కర్నాటకకు చెందిన లీషా పాల్ తమిళనాడుకు చెందిన ఆదర్శిణి శ్రీని 16-21, 21-16, 21-13 స్కోర్లు తేడాతో గెలుపొందింది. బాలుర సింగిల్స్ అండర్ - 19 విభాగంలో కర్నాటకు చెందిన తుషార్ సువీర్ తమిళనాడుకు చెందిన సుజీ సాయి బాల సింఘపై 12-21, 21-13, 21-15 స్కోర్లు తేడాతో గెలుపొందాడు. బాలికల సింగిల్స్‌లో అండర్ -19 విభాగంలో ఆంఽధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవల్లిక మణి ఆమర్తి పాండిచ్చేరికి చెందిన జననికపై 21-16, 21-12 స్కోర్లు తేడాతో గెలిచింది. అలాగే, మెన్స్ డబుల్స్‌లో తమిళనాడుకు చెందిన హరిహరన్, రూబప్ కుమార్ జోడీ కర్నాటకకు చెందిన కిషాల్, రుద్రపై గెలుపొందారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో కర్నాటకకు చెందిన దీపక్‌రాజ్, పొన్నమ్మ జోడీ ఆంధప్రదేశ్‌కు చెందిన దీపిక, స్రవంతి జంటపై గెలుపొందారు. జూనియర్ మిక్స్‌డ్ డబుల్స్ అండర్ - 19 విభాగంలో తమిళనాడుకు చెందిన నిరంజన్, వర్ణ జోడీ కర్నాటకు చెందిన ఆర్య, దీపక్‌రాజ్ జోడీపై విజయం సాధించారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ...
సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, జనసేన పార్టీ సిటీ ఇన్‌ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మచౌదరి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాడ్మింటన్ కోచ్‌లు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పుష్కరఘాట్‌లో 30 లాకర్స్ ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 11: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 30 లాకర్స్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించా రు. బుధవారం పుష్కరాల రేవులో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కరాలరేవులో గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు వారి సామాన్లు భద్రపరుచుకోవడానికి ఇక్కడ ఎటు వంటి సౌకర్యం లేకపోవడంతో లాకర్స్ ఏర్పాటుచేశారు. గోదావరి వరద ఉధృతి తీవ్రంగా ఉందని రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారని అందువలన వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకున్న కమిటీలు గణపతి విగ్రహాల నిమజ్జనం మరొక రెండురోజులు పొడిగించుకోవాలని సూచించారు. పుష్కరాలరేవులో మహిళలు దుస్తులు మార్చుకునే గది చాలా అధ్వానంగా ఉందని దానిని ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ, రుడా అధికారులు పాల్గొన్నారు.
రూ.44 కోట్ల పనులకు ప్రతిపాదనలు
ఫ రాజమహేంద్రవరంలో దెబ్బతిన్న పైప్‌లైన్లు పరిశీలించిన కమిషనర్
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 11 : రాజమహేంద్రవరంలో దెబ్బతిన్న బిటీ రోడ్లు, మురుగునీటి పైప్‌లైన్లను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్డ్ పరిశీలించారు. బుధవారం కమిషనర్ నగరంలో ఆర్యాపురం ఎన్‌ఆర్‌సీపీ నుంచి ఎస్‌టీపీకి వెళ్లే మురుగునీరు పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించారు. ఇప్పటికే నగరంలో డ్రోన్ల సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించిన కమిషనర్ కేతన్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నగరంలో వివిధ పనులకు సంబంధించి రూ.44 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిచారు. ఈ నేపథ్యంలో అత్యవసర పనులను త్వరగా చేపట్టాలని, మరమ్మతులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట ఎస్‌ఈ పాండురంగారావు, ఈఈ, డీఈ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని ముంచెత్తిన వరద
వరద ఉధృతిని పరిశీలించిన కొవ్వూరు సబ్‌కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ
కొవ్వూరు, సెప్టెంబర్ 11: అఖండ గోదావరికి మూడోసారి వరద పొటెత్తింది. గోదావరినది ఎగువ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, ఉపనదులు పొంగి ప్రవమిస్తున్నాయి. వాటినుంచి అధికసంఖ్యలో వరద ప్రవాహం వచ్చి గోదావరిలో చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన భద్రాచలం, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్‌లవద్ద ప్రమాద హెచ్చరికలు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజ్‌కు ఉన్న ధవళేశ్వరం, ర్యాలి, మద్దూరులంక, విజ్జేశ్వరం ఆరమ్‌లలోని 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని వరద గోదావరి ముంచెత్తింది. బుధవారం కొవ్వూరు సబ్‌కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పట్ట ణ సీఐలు గోష్పాదక్షేత్రంలో వరద ఉధృతిని పరిశీలించారు. నదీ ప్రవాహాం ప్రమాదకరంగా ఉన్నందున స్నానఘట్టాలు, క్షేత్రంలోకి ఎవ్వరూ దిగకుండా ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గస్తీ ఏర్పాటుచేశారు. క్షేత్రంలోకి వచ్చే రోడ్డు ప్రధాన రహదారులు, ఆలయాలన్నీ నీట మునిగాయి. అదేవిధంగా కొవ్వూరు మండలం మద్దూరులంకలోని ముంపు ప్రాంతం పల్లిపాలెంలో నివసిస్తున్న 17 కుటుంబాలకు చెందిన 49 మందిని మద్దూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. సబ్‌కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, ఇంచార్జి తహసీల్దార్ కె.అజయ్‌బాబులు పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడికి వచ్చిన ప్రజల నుంచి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఉధృతంగా గోదావరి
పెరవలి: గోదావరి ఎగువ భాగం నుంచి వస్తున్న వరద నీటితో ఈ ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రానికి నాలుగు అడుగుల మేర నీరు పెరగడంతో పల్లపులంక భూములతోపాటు పై లంక భూములు కూడా నీట మునుగుతున్నాయి. వరద ఉధృతి ఇదేవిధంగా ఉంటే గురువారం సాయంత్రానికి మొత్తం లంక భూములన్నీ నీట మునుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకభూముల్లో వివిధ రకాల పంటలు అరటి, కంద, వివిధ రకాల కూరగాయల పంటలతోపాటు పచ్చగడ్డి బీడులు పాడైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లంకభూముల్లో గల పశువులను ఏటిగట్టుపైకి చేర్చాలని తహసీల్దార్ అచ్యుతకుమారి, పశువైద్యురాలు డాక్టర్ సల్మా, గోదావరి పరివాహక గ్రామాలు పర్యటించి రైతులను కలుసుకుని వారికి తగిన సూచనలు ఇచ్చారు.