Share News

కచ్చులూరు.. కన్నీళ్లు!

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:29 AM

గోదారిలో కన్నీటికి ఐదేళ్లు.. నాడు పాపికొండలు విహారయాత్ర విషా దంగా మారింది.. ఆ సంఘటన పాపికొండల పర్యాటకానికి వెళ్లేవారిలో తీవ్ర భయాన్ని నింపింది. ఎందుకంటే 49 మంది పర్యాటకులు గోదావరిలో జల సమాధి అయి ఐదేళ్లయింది..

కచ్చులూరు.. కన్నీళ్లు!
బోటుకు వేలాడుతున్న మృతదేహాలు (ఫైల్‌)

గోదారిలో పెను ప్రమాదం

49 మంది పర్యాటకులు మృతి

గోదావరిలో 38 రోజులు ఆపరేషన్‌

అతి కష్టం మీద బోటు వెలికితీత

అప్పటికీ.. ఇప్పటికీ ఇదొక పెను విషాదమే

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదారిలో కన్నీటికి ఐదేళ్లు.. నాడు పాపికొండలు విహారయాత్ర విషా దంగా మారింది.. ఆ సంఘటన పాపికొండల పర్యాటకానికి వెళ్లేవారిలో తీవ్ర భయాన్ని నింపింది. ఎందుకంటే 49 మంది పర్యాటకులు గోదావరిలో జల సమాధి అయి ఐదేళ్లయింది.. సరిగ్గా 2019 సెప్టెంబరు 15వ తేదీన 77 మందితో వెళుతున్న పర్యాటక బోటు కాస్తా గోదావరి సుడిగుండంలో చిక్కుకుంది. అప్పట్లో 26 మందిని స్థానిక జాలర్లు కాపాడినా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర దుర్ఘటన ఇప్పటికీ గోదావరి ప్రజలకు కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.ఆనాటి ఘోర సంఘటనను తలచుకుంటేనే కంట కన్నీళ్లే ... చాలా జీవితాల్లో నేటికీ ఆ కన్నీరు విషాదకలిగా మిగిలే ఉంది. పాపికొండలు విహారయాత్రలో అయినవారిని కోల్పోయినా అనేక మంది నది ఒడ్డునే రోజుల తరబడి అన్వేషించారు. అయిన వారు కానరాక, తిండీతిప్పలు లేక రోదనలతో తిరుగాడినవారెందరో. చిన్నారులను కోల్పోయిన కొందరు, భార్యల కడసారి చూపుకైనా నోచుకోవాలని ఇంకొందరు, కనిపించకుండా పోయిన తల్లిదండ్రుల కోసం రెప్పలమాటున కన్నీరుబుకుతుండగా విషణ్ణ వదనాలతో వేచి చూసినవారు ఇంకొందరు. పాపికొండలు విహార యాత్ర అంటే జనం అమితాసక్తి చూపేవారు. ప్రకృతి అందాలకు నెలవైన పాపి కొండలు విహారయాత్ర తమ జీవితానికి గొప్ప అదృష్టమంటూ మురిసిపో యిన వారెందరో. దూరభారమైనా పిల్లాపాపలతో ఒక రోజు అయినా గోదా వరి నదిలో గడిపామన్న తృప్తి మిగుల్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చేవారు. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరు 15న గోదావరి ఒడ్డున గండిపోచమ్మ దేవాలయం వద్ద వశిష్ఠ పున్నమి రాయల్‌ పర్యాటక బోటులోకి అప్పటికే నిర్దేశించిన పర్యాటక ప్రియులంతా తమవారితో కలిసి ఎక్కారు. గండిపోచమ్మ దేవాలయం నుంచి దాదాపు మూడున్నర గంటల పాటు ప్రయాణించి బోటు ముందుకు సాగుతుంది.. మరో నాలుగు గం టల్లో పాపికొండలుకు బోటు చేరుకోవాల్సి ఉండగా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం సమీపాన గోదావరి అతి వేగంగా ప్రయాణిస్తూ ఓ సుడిగుండంలా ఏర్పడి ఉంది. 77 మంది పర్యాటకులతో గోదావరిలో ప్రయాణిస్తున్న వశిష్ఠ బోటు కాస్తా ప్రవాహానికి ఎడమవైపున వెళ్లాల్సి ఉం డగా కుడి వైపున ప్రయాణించి సుడిగుండంలో చిక్కుకుంది. ఒక్కసారిగా హాహాకారాలతో పర్యాటకులంతా కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు ప్రవహి స్తోంది. ఒకవైపు వరద ఉధృతి.. మరో వైపు క్షణాల్లోనే బోటు సుడిగుం డంలో ఒరిగిపోయింది. అప్పటికే సమీపాన మత్స్యకారులు జరిగిన ప్రమా దాన్ని గమనించి అప్రమత్తమయ్యారు. క్షణాల్లోనే వేగంగా అక్కడికి చేరు కుని 26 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకెళ్లగలిగారు. అప్పటికే పర్యాటక బోటులో ఉన్న 49 మందితో బోటు కాస్తా గోదావరిలో మునిగిపోయింది. రాష్ట్రమంతటా ఈ ఘటన పెను విషాదాన్ని సృష్టించింది. మునిగిపోయిన పర్యాటక బోటును బయటకు తీయడానికి కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. 38 రోజుల పాటు శ్రమించి అప్పట్లో అక్టోబరు 21వ తేదీన బోటును వెలికితీయగలిగారు. మరో వైపు ఇప్పటికీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఉన్నవారి సంఖ్యపై సరైన సమాచారం లేదు. ఈ ఘోర దుర్ఘటన అప్పటికీ ఇప్పటికీ పాపికొండలు పర్యాటక ప్రియులను కలచివేస్తూనే ఉంది. కచ్చులూరు దుర్ఘటన అనంతరం కొన్నాళ్ల పాటు పాపికొండలు యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. బోటులో ప్రయాణించే వారి రక్షణ చర్యలు పూర్తిగా గమనిం చిన తర్వాత ప్రయాణించే బోటు సామర్థ్యాన్ని ముందుగా నిర్ధారణ చేసిన తర్వాతే పాపికొండలు యాత్రకు అనుమతిస్తూ వస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:29 AM