Share News

గాంధీ నడిచాడిక్కడే

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:21 AM

స్వాత్రంత్రోద్యమ పర్యట నకు ముందే గాంధీ తునిలో పర్యటించి బస చేశారు. ఆ ప్రాంతం ప్రస్తుతం గాంధీ సత్రంగా పేరుపడింది.

 గాంధీ నడిచాడిక్కడే

నేడు గాంధీ జయంతి

ఉమ్మడి తూర్పున బాపూజీ అడుగుజాడలు

రాజమండ్రికి వచ్చింది ఐదు సార్లు

మహాత్ముడి జీవితమే.. ఒక మహోద్యమం. చేతిలో ఊతకర్ర.. బక్కపలుచని శరీరం.. అదీ వయస్సుమీరిన రోజుల్లో ఎలాంటి ఆయుధం లేకుండా స్వాతంత్య్రం సిద్ధించేదాకా జాతి యావత్తునూ ఏకతాటిపై నడిపించాడంటే ఆయనను మహాత్ముడుకాక ఇంకేమంటాం. అందుకే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ గాంధీజీని ఉద్దేశించి చెప్పినట్టు ‘‘కొన్నేళ్ల తర్వాత రక్తమాంసాలు గల ఇలాంటి వ్యక్తి భూమ్మీద నడిచాడని చెబితే రాబోయే ముందు తరాల వారు నమ్మలేరు..’’ ఎంత గొప్ప నిర్వచనం ఇది. స్వాతంత్య్ర పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మన జాతిపిత దేశమంతటా పర్యటించారు. ప్రజలందరినీ స్వాతంత్య్ర సమరంలోకి దూకేలా ఉత్తేజితమైన ప్రసంగాలు చేశారు. పోరాటంలో ముందుండి నడిపించారు. మన గోదావరి జిల్లాల్లోనూ గాంధీజీ విస్తృతంగా పర్యటించి సమరశంఖం పూరించారు. ఆయన వెంట ప్రజలంతా ఏకమై నడిచారు. స్వరాజ్యం మా హక్కని ముక్తకంఠంతో నినదించారు. స్వాతంత్య్ర పోరులో జైళ్లకెళ్లారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన స్మృతులు మళ్లీ ముందుకు..

- రాజమండ్రి (ఆంధ్రజ్యోతి)/ కాకినాడ సిటీ/కరప

1921 మార్చి 30వ తేదీ రాత్రి గాంధీ తొలిసారిగా రాజమహేంద్రవరంలో అడుగుపెట్టారు. విజయ నగరంలో తన పర్యటన ముగించుకుని బెజవాడ మెయిల్‌లో వెళుతూ ఇక్కడి రైల్వే స్టేషన్‌లో ఆహ్వానం మేరకు దిగారు. 1921 ఏప్రిల్‌ 6వ తేదీన మహాత్మాగాంధీ దంపతులు కాకినాడ నుం చి రాజమహేంద్రవరం సభకు విచ్చేశారు. 1929 మే 6న గాంధీ మూడోసారి వచ్చారు. గాంధీజీ.. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతు లు టౌన్‌హాల్‌ను సందర్శించినట్టు చెబుతారు. 1933 డిసెంబర్‌ 24న ఆయన నాల్గోసారి పాల్‌ చౌక్‌లో ఆయన ప్రసంగించారు. ఐదోసారి అంటే చివరగా 1946 జనవరి 20 రాజమండ్రి వచ్చారు.

దక్షిణాఫ్రికా టూ తుని..

తుని రూరల్‌ : స్వాత్రంత్రోద్యమ పర్యట నకు ముందే గాంధీ తునిలో పర్యటించి బస చేశారు. ఆ ప్రాంతం ప్రస్తుతం గాంధీ సత్రంగా పేరుపడింది. 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన గాంధీజీ దేశ ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు దేశ పర్యటనలో భాగంగా 1916లో రైలులో మార్గమధ్యలో తునిలో ఆగారు. తునికి ప్రధాన కూడలిగా ఉన్న గొల్లప్రోలు సెంటర్‌ పక్కనే సత్రం ప్రాంగణంలో ఒక పెద్ద చెట్టు కింద ఈ ప్రాంత వాసులతో సభ నిర్వహించి స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటిరోజే పయనమయ్యారు.

కాకినాడలో మ్యూజియం

కార్పొరేషన్‌(కాకినాడ):స్వాతంత్రోద్యమ సమయం 1921 నుంచి 1929 మధ్యలో మూడుసార్లు గాంధీజీ కాకినాడ వచ్చారు. గాంధీజీ ఇక్కడికి వచ్చినప్పటి విషయాలతో పాటు ఆయన బాల్యం నుంచి స్వాతంత్య్రం సాధించే వరకు ఉన్న జీవిత ఘట్టాలను తెలియజేస్తూ కాకినాడ కార్పొరేషన్‌ వెనుక ప్రాంతంలో గాంధీభవన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీజీ మ్యూజియం, ఆయన చిత్రపటాలతోపాటు 400 కిలోల కాంస్య విగ్రహం ఏర్పాటుచేశారు. ఆయనను నిత్యం స్మరించుకునేలా గాంధీనగర్‌లో ఓ పార్కుకు గాంధీపార్కుగా, ఓ ప్రాంతానికి గాంధీనగర్‌గా అప్పట్లోనే నామకరణం చేశారు. కాకినాడ గాంధీభవన్‌ పేరున కరపలో 5.87 ఎకరాల భూమి ఉంది. వేళంగి గ్రామానికి చెందిన మెర్ల వెంకటసుబ్బారావు 1952 ఆగ స్టు 5న తన స్వార్జిత భూమిని గాంధీభవన్‌ ట్రస్ట్‌కు రాసిచ్చారు.

కాకినాడకు మూడుసార్లు..

స్వాతంత్రోద్యమకాలంలో మహాత్మాగాంధీ కాకినా డలో మూడుసార్లు పర్యటించారు. 1921 ఏప్రిల్‌ 3న కాకినాడలో గాంధీజీ దంపతులు, వారి నాలు గో కుమారుడు రైలు దిగారు. గుర్రపు బండిపై పెద్ద బజారు గుండా జగన్నాథపురంలోని పైడా వెంకట నారాయణ ఇంటికి చేరుకున్నారు. 1923 డిసెంబర్‌ 28న గాంధీనగర్‌లో జరిగిన అఖిలభా రత కాంగ్రెస్‌ సభలకు జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వంటి నేతలు విచ్చే యగా, పరవాడ జైలులో ఉన్న కారణంగా మహా త్మాగాంధీ హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత 1930, 1933లలో రెండుసార్లు కాకినాడ వచ్చిన గాంధీ స్వాతంత్రోద్యమ సభల్లో పాల్గొన్నారు.

నేటికీ ఆ గాంధీ భవన్‌లు పదిలమే!

ద్రాక్షారామ/రాజోలు: మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో 1929 ఏప్రిల్‌, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. మే నెలలో రామచంద్రపురం మండలం వెల్ల, చోడవరం గ్రామాల్లో గాంధీజీ పర్యటించారు. మే 1న వెల్ల వంతెన వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం సాయంత్రానికి చోడవరం చేరుకుని రాత్రి బిక్కిన వెంకటరత్నం (మాజీ కేంద్ర మంత్రి) నివాసంలో బసచేశారు. ఆ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1929 మే 5న ఆదివారం గాంధీ అమలాపురం మీదుగా సాయంత్రం 6 గంటలకు మామిడికుదురు మండల పాశర్లపూడి రేవు దాటారు. గాంధీ తన సహచరి కస్తూరిబాతో రాత్రి 8 గంటలకు పొన్నాడ సూర్యారావు ఇంటికి అతిథిగా విచ్చేశారు. వారికి అపూర్వమైన ఆతిథ్యాన్ని సూర్యారావు అందించారు. ఆ రాత్రి గాంధీజీ మౌనవ్రతం చేశారు. 1929 మే 5, 6 తేదీల్లో పొన్నాడ సూర్యారావు ఇంట్లోనే గాంధీ బస చేయడం విశేషం. అప్పటి నుంచి ఆ ఇల్లు గాంధీ హౌస్‌ అయింది.

సీతానగరంలో సత్యాగ్రహాశ్రమం

సీతానగరం: రాజమహేంద్రవరానికి 25 కి.మీ దూరంలో ఉన్న సీతానగరంలో 1924 నవంబరు 9న వైద్యుడు బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం గోదావరి గట్టుకు సమీపంలో గౌతమి సత్యాగ్రహా శ్ర మం పేరుతో ఏర్పాటుచేశారు. దీనికి అల్యూమిని యం వ్యాపారి శేఠ్‌ జీవన్‌లాల్‌ ఆర్థిక సాయం అందించారు. ఈ ఆశ్రమాన్ని బాపూజీ రెండు సార్లు సందర్శించడం విశేషం. 1925 ఫిబ్రవరి 4న డాక్టర్‌ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఇక్కడ గృహప్రవేశం జరిపారు. గాంధీజీ తన స్వాతంత్రోద్యమ పర్యటనలో భాగంగా 1929 మే 8, 9 తేదీల్లో ఆశ్రమంలో బస చేశారు. 1933 డిసెంబరు లో ఈ ఆశ్రమానికి రెండోసారి వచ్చి ఆశ్రమవాసులను ఉత్తేజపర్చారు. బాపూజీ సతీసమేతంగా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. కస్తూర్బాగాంధీ పరమపదించిన అనంతరం ఆమె పేరుతో గౌతమి సత్యాగ్రహాశ్రమానికి కస్తూర్భాగాంధీ ఆశ్రమంగా పేరు మార్చారు.

పలివెలలో గాంధీజీ..

కొత్తపేట, అక్టోబరు 1 : స్వాతంత్య్ర సమరయోధులైన కళా వెంకట్రావు, నడింపల్లి సుబ్బరాజు, బలుసు సాంబమూర్తి, తురగా పురుషోత్తం తదితరుల పిలుపు మేరకు మహాత్మాగాంధీ 1929 మే 5న పలివెలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 1929లో ఖద్దర్‌ నిధులకు విరాళాలు సేకరణ, కాంగ్రెస్‌ మూల సిద్ధాంతమైన స్వరాజ్యం నుంచి సంపూర్ణ స్వాతంత్రోద్యమ తీర్మానానికి కొత్తపేట మండలం పలివెలలోనే బీజం పడిందని గాంధీ అధ్యయన సంస్థ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు తెలిపారు. పలివెలలో 1929 మే 5న పర్యటించిన మహత్మాగాంధీ ఖద్దర్‌ నిధికి రూ.1,117లు విరాళాలుగా సేకరించారు.

Updated Date - Oct 02 , 2024 | 01:21 AM