అడవిని వదిలి..జనారణ్యంలోకి..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:23 AM
అమ్మో పులి.. రాజమహేంద్రవరంలో ఉందట.. ఎవరి నోటా విన్నా ఇదే మాట.. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో... ఎందుకు వచ్చిందో అంటూ రకరకాల ప్రశ్నలు.. ఒక్క ప్రశ్నకూ అంతుచిక్కదు..
ఇంకా కొనసాగుతున్న అన్వేషణ
పాపికొండలు అభయారణ్యం నుంచే రాక?
ఇక్కడకు రావడానికి కారణాలపై విశ్లేషణలు
ఎలా వచ్చిందనే దానిపై ఇంకా అస్పష్టత
పులి కంటే చిరుతపులే ప్రమాదకరం
ఆకలి వేసినప్పుడే పులి వేట..
చిరుతది నిరంతర వేట
అమ్మో పులి.. రాజమహేంద్రవరంలో ఉందట.. ఎవరి నోటా విన్నా ఇదే మాట.. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో... ఎందుకు వచ్చిందో అంటూ రకరకాల ప్రశ్నలు.. ఒక్క ప్రశ్నకూ అంతుచిక్కదు.. మరో వైపు అటు వైపు వెళితే ఏం జరుగుతుందోననే భయం.. గత 10 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదీ పరిస్థితి. అసలు పులి ఎక్కడ నుంచి.. ఎలా వచ్చి ఉంటుంది... ఇక్కడికే ఎందుకు వచ్చింది.. అసలేం చేస్తుందనే దానిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
అడవి నుంచి దారి తప్పి జనారణ్యంలోకి చిరుత పులి ఎలా రాగలిగింది? చిరుత పులులకు ఆవాసంగా ఉన్న పాపికొండలు అభయారణ్యం నుంచి గోదావరి నది మీదు గా వచ్చిందా...లేదా అదే అభయారణ్యం విస్తరించి ఉన్న రంపచోడవరం,మారేడుమిల్లి మీదుగా వచ్చిందా? అటవీ శాఖ రకరకాల విశ్లేషణలు చేస్తోంది. రోజుకు వంద కిలో మీటర్లకుపైగా నడిచే చిరుత పులి ఎన్ని రోజుల పాటు నడుచుకుని ఇక్కడకు వచ్చింది? అనే దానిపై అటవీ శాఖలో చర్చ సాగుతోంది. భారీ వర్షాలు, వరద లకు అడవుల్లో చిరుతపులి స్థావరం దెబ్బతింటే అక్కడి నుంచి సురక్షిత స్థావరం వెదికే క్రమంలో దారితప్పి ఉంటుం దని అనుమానిస్తున్నారు. చిరుత పులి స్థావరంలోకి పెద్ద పులి వస్తే తక్షణం ఉండే ప్రాంతాన్ని మార్చడం చిరుత లక్షణం కావడంతో ఆ క్రమంలో దారితప్పి ఉంటుందని భావిస్తున్నారు.ఈ క్రమంలో గోదావరిని ఈదుకుంటూ రావడం లేదా రంప అడవుల నుంచి గోకవరం మీదుగా రాజమహేంద్రవరంలోకి వచ్చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇంకో పులితో జత కట్టిన తర్వాత ఆడ, మగ పులి విడిపోతాయి.ఇలా మళ్లీ జత కోసం ప్రయత్నిం చే సమయంలో దారితప్పి నగరంలోకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.గతంలో ఉమ్మడి జిల్లాలకు దారితప్పి వచ్చి న చిరుతల ఘటనలతో పోల్చి విశ్లేషణలు చేస్తున్నారు.
ఎలా వచ్చిందంటే...
పాపికొండలు అభయారణ్యం నుంచే చిరుతపులి దారితప్పి వచ్చిందని చెబుతున్నారు. ఎందుకంటే పులులు, చిరుత పులులకు పాపికొండలు అభ యారణ్యం పెట్టింది పేరు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా వీటి పరిధిలోని ఏజెన్సీ కలిపి మొత్తం 1.02 లక్షల హెక్టా ర్లు అంటే 2.60 లక్షల ఎకరాలు.ఈ కొండల మధ్యలో గోదావరి ఉంది. ఈ అభయారణ్యం పులులకు ఆవాసం. మూడేళ్లకోసారి కెమెరా ట్రాప్ ద్వారా పులుల లెక్కింపును అధికారులు చేపడతారు. ఇటీవల ఈ అభయారణ్యంలో అధికారులు రెండు దశల్లో 232 ట్రాప్ కెమెరాలతో 116 ప్రాంతాల్లో సర్వే చేయగా నాలుగు పెద్దపులులు,ఆరు చిరుత పులులు ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కని చిరుత పులులు మాత్రం ఇంకో 12 వరకు ఉండొచ్చని అంచనా. రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లోనూ చిరుతల సంచారమే అధికమని అక్కడ పనిచేసిన అటవీ అధికారులు చెప్తున్నారు. రాజమహేంద్రవరంలోకి దారితప్పి వచ్చిన చిరుత పాపికొండలు అభయారణ్యం నుంచే వచ్చిందని చెబున్నారు. ఇటీవల గోదా వరికి వరద పోటెత్తడంతో అడవుల్లో చిరుత స్థావరం చెల్లాచెదురై కొత్త స్థావరం కోసం వెదికే క్రమంలో గోదావరి ఈదుకుంటూ రాజమహేంద్రరంలోకి వచ్చి ఉండొచ్చని అంచనా. పాపికొండలు అభయారణ్యం విస్తరించిన ఏజెన్సీ ప్రాంతంలోను వీఆర్‌పురం, రంపచోడవరం, మారేడుమిల్లి, గోకవరం మీదుగా చిరుత రాజమహేంద్రవరంలోకి దారి తప్పి వచ్చి ఉండొచ్చని చెప్తున్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోలవరం ప్రాజెక్టు మీదుగా రంప ఏజెన్సీ వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యంలో ఎటువైపైనా పులులు దారి తప్పవచ్చని విశ్లేషిస్తున్నారు.
అందుకే కదలడం లేదా...
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏలూరు జిల్లా పరిధిలోకి ఓ మగ పులి పాపికొండలు అభయారణ్యంలోకి వచ్చింది. వంద కిలోమీటర్లకుపైగా నడిచి తిరిగి అభయారణ్యం లోకి వెళ్లిపోయింది. పాపికొండలు అభయారణ్యాన్ని ఆనుకుని కొండలు, గోదావరి నది ద్వారా పులి సంచ రించి ఇలా వచ్చిందని అప్పట్లో భావించారు. 2022 మేలో ఓ పులి ఏజెన్సీ మీదుగా ప్రత్తిపాడు, శంఖవరం, తుని రూరల్ మీదుగా వెళ్లింది. ప్రత్తిపాడులో బోనులోకి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్న అడవుల నుంచి కొన్నిసార్లు దారితప్పడం వలనే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు రాజమహేంద్రవరంలోకి చిరుతపులి రావడం క్రమేపీ నగ రాల్లోకి దారితప్పి వస్తున్న పులుల సంచారం చర్చనీ యాంశంగామారింది.రాజమహేంద్రవరంలో సంచరిస్తున్న చిరుత రిజర్వు ఫారెస్టులో ఉంది. అనువైన వాతావరణం ఉండడంతో అక్కడి నుంచి కదలట్లేదని సమాచారం.
పిల్లలను బయటకు రానీయవద్దు : డీఎఫ్‌వో
దివాన్‌చెరువు, సెప్టెంబరు 15: దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయని ఇన్‌చార్జి డీఎఫ్‌వో ఎస్.భరణి తెలిపారు. ప్రస్తుతం చిరుతపులి దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలోనే ఉందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్‌బోర్డుకాలనీ,ఆటోనగర్, దివాన్‌చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఏరియాల్లో పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
10 రోజులైనా చిక్కని చిరుత..
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం శివారులోని 900 ఎకరాల రిజర్వు ఫారెస్టులో పది రోజుల నుంచీ చిరుత హుందాగా సంచరిస్తూ అటవీ అధికారులకు మాత్రం చిక్కడం లేదు. పట్టుకొని తీరుతామని అటవీ అధికారులు.. పట్టుకోండి చూద్దామంటూ చిరుతపులి ప్రతిరోజూ సవాళ్లు విసురు కుంటూనే ఉన్నారు. అటవీ అధికారులు అమర్చిన 50 ట్రాప్ కెమెరాల్లోని ఎక్కడో అక్కడ చిరుత ఫొటోకు ఫోజు ఇచ్చి వెళ్లిపోతోంది. ఆ కెమెరాలను అటవీ సిబ్బంది తనిఖీ చేసే సమయానికి పుణ్యకాలం గడిచిపోతోంది. 50 మంది సిబ్బందితో కూడిన బృందాలు ఏ ప్రయత్నాలు చేస్తున్నా నాలుగు బోన్‌లలో ఒక్క దాంట్లోకీ చిరుత దూరడం లే దు. థర్మల్ డ్రోన్‌ని వినియోగించినా ఫలితం కానరావడం లేదు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు, ఆటోనగర్, దివాన్ చెరువు, శ్రీరాంపురం తదితర ప్రాంతాల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వ యంత్రాం గం ప్రణాళికలు..విశ్లేషణలు.. ప్రకటనల మాట ఎలా ఉన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు.