Share News

ప్రతి ప్రశ్నకూ ఒకే సమాధానం

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:23 AM

ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం... తెలియదు, గుర్తులేదు’... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పోలీస్‌ కస్టడీలో చెప్పిన మాటిది.

ప్రతి ప్రశ్నకూ ఒకే సమాధానం

నాకు తెలియదు.. గుర్తులేదు!

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోపోలీసు కస్టడీలో నందిగం సురేశ్‌

విచారణకు సహకరించని వైనం

ఆదివారం రాత్రి స్టేషన్‌లోనే నిద్ర

మంగళగిరి సిటీ, సెప్టెంబరు 15: ‘ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం... తెలియదు, గుర్తులేదు’... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పోలీస్‌ కస్టడీలో చెప్పిన మాటిది. విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఆదివారం మంగళగిరి రూరల్‌ పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంటకు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. సురేశ్‌ను చూసేందుకు ఆయన భార్య, పిల్లలు, బంధువులు, అనుచరులు వచ్చినప్పటికీ పోలీసులు ప్రాంగణం వెలుపలే నిలువరించారు. తొలిరోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ కొనసాగింది. మంగళగిరి రూరల్‌ సీఐ, కేసు దర్యాప్తు అధికారి వై.శ్రీనివాసరావు పలు ప్రశ్నలను సంధించారు. గతంలో సురేశ్‌ను పోలీసులు విచారించినప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను కూడా వెళ్లానని, అయితే అది సరైన విధానం కాదని భావించి వెనక్కి వచ్చేశానని ఆయన తెలిపారు. అదే కోణంలో ఇప్పుడు కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన రోజు ఎన్ని, ఏయే వాహనాల్లో వెళ్లారు? ఏ ఫోన్లు ఉపయోగించారు? వంటి ప్రశ్నలను అడిగినట్టు సమాచారం. అయితే పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ సురేశ్‌ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. సోమవారం కూడా విచారణ కొనసాగనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేశ్‌ తరఫు న్యాయవాది బాజీగంగాధర్‌రావును విచారణ సందర్భంగా పోలీసులు అనుమతించారు. ఆదివారం రాత్రి ఆయన పోలీసు స్టేషన్‌లోనే నిద్రించారు.

నేడూ కస్టడీలోనే

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌ అరెస్టు భయంతో సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని ఈ నెల 5వ తేదీన పారిపోయేందుకు ప్రయత్నించగా మంగళగిరి రూరల్‌ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మంగళగిరి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. నందిగం సురేశ్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం 12 గంటల వరకు ఆయన పోలీసు కస్టడీలో విచారణను ఎదుర్కొంటారు.

Updated Date - Sep 16 , 2024 | 03:23 AM