Share News

ముప్పు ముంగిట కొల్లేరు!

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:08 AM

ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సుకు ముప్పు పొంచి ఉంది.బుడమేరు

ముప్పు ముంగిట కొల్లేరు!

ఎగువ నుంచి వస్తున్న భారీ వరద

కైకలూరు, సెప్టెంబరు 4: ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సుకు ముప్పు పొంచి ఉంది.బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, చంద్రయ్య కాలువ, మాదేపల్లి చానెల్‌, పోతునూరి చానెల్‌, దోసపాడు చానెల్‌ తదితర 14 చానెళ్లు, 15 కాలువల ద్వారా వేల క్యూసెక్కుల భారీ వరద కొల్లేరులోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో తమ గ్రామాలకు ముప్పు ఉంటుందని కొల్లేరు సరస్సు పరిధిలోని 44 లోతట్టు లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మండవల్లి మండలం పెనుమాకలంక-పెదయడ్లగాడి రోడ్డు, కైకలూరు- ఏలూరు రోడ్డు, కైకలూరు మండలంలో అటపాక పక్షుల కేంద్రం సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీరు కొల్లేరు సరస్సు నుంచి సర్కారు కాలువ ద్వారా ఉప్పుటేరు మార్గం గుండా సముద్రంలో కలుస్తుంది. అయితే, ఉప్పుటేరుపై గతంలో రైల్వే డబ్లింగ్‌ పనుల నిర్మాణంలో భాగంగా ఉప్పుటేరు మధ్యలో భారీ పిల్లర్లు వేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో గుర్రపుడెక్క, తూడు అలుముకున్నాయి. దీంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అలాగే ఇటీవల 165వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం గ్రామం వద్ద ఉప్పుటేరుపై మరో వంతెన నిర్మాణానికి అధికారులు పనులు చేపట్టారు. నిర్మాణం ప్రారంభం దశలోనే ఉప్పుటేరు సగభాగానికి దట్టంగా బుసకను తోలి పూడ్చివేశారు. సాంకేతిక కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేసినా.. తోలిన మట్టి దిబ్బలు ఏరుకు అడ్డుగా ఉన్నాయి. దీంతో నీటి ప్రవాహం సాగడం లేదు. దీంతో ఎగువన ఉన్న కొల్లేరు సరస్సుకు ముప్పు తప్పదనే అంచనాలు వేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లు బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, భయం అవసరం లేదని స్థానికులకు భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 05 , 2024 | 07:03 AM