సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:21 AM
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్రానికి తీరంలో జరిపిన శాశ్వత కాంక్రీటు నిర్మాణాల కూల్చివేత విషయంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్రానికి తీరంలో జరిపిన శాశ్వత కాంక్రీటు నిర్మాణాల కూల్చివేత విషయంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి తేల్చిచెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ఽధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. అంతకుముందు బుధవారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే నేహారెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారన్నారు. వారిచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశామన్నారు. అన్ని అనుమతులూ తీసుకున్నాకే నిర్మాణాలు ప్రారంభించామని.. కూల్చివేతలు నిలిపివేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. భీమునిపట్నం పరిధిలోని సీఆర్‌జెడ్-1 ప్రాంతంలో సముద్రానికి అతిసమీపంలో శాశ్వత కాంక్రీటు నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిర్మాణాలను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఇసుక తిన్నెలను ధ్వంసం చేసిన బిల్డర్‌పై క్రిమినల్ చర్యలు ప్రారంభించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన ధర్మాసనం.. సముద్రానికి అతిసమీపంలో జరుపుతున్న శాశ్వత నిర్మాణాలను తక్షణం నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ యంత్రాలను అక్కడికక్కడే తక్షణం సీజ్ చేయాలని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు జీవీఎంసీ అధికారులకు వెసులుబాటు ఇచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో నేహారెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో జీవీఎంసీ అధికారులు సీఆర్‌జెడ్ ప్రాంతంలో ఉన్న కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. దీనిపై ఆమె ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. అక్కడా చుక్కెదురైంది.