Share News

అవినీతి ‘గని’పరార్‌!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:46 AM

ఊహించిందే జరిగింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి విదేశాలకు పరారయ్యారు.

అవినీతి ‘గని’పరార్‌!

గనుల వెంకటరెడ్డి విదేశాలకు జంప్‌

ప్రభుత్వ అలసత్వమే కారణం?

ఇసుక అక్రమాల్లో జూన్‌ 7న బదిలీ వేటు

మధ్యలో తన సస్పెన్షన్‌పై హైకోర్టులో

పిటిషన్‌ వేయడానికి రాక

ఆ వెంటనే తిరిగి హైదరాబాద్‌కు

తర్వాత 3 రోజులకు ఏసీబీ కేసు

ఇప్పుడు గాలిస్తున్నా ప్రయోజనం శూన్యం

అన్నీ తెలుసుకునే దర్జాగా విదేశాలకు!

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఊహించిందే జరిగింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి విదేశాలకు పరారయ్యారు. ఇసుక కాంట్రాక్టులో అవినీతి, అక్రమాల కేసులో ఆయన కోసం ఏసీబీ గత రెండు మూడ్రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే అంతకు ముందే వెంకటరెడ్డి విదేశాలకు పారిపోయినట్లు తాజాగా వెలుగుచూసింది. ఇసుక అక్రమాల కేసులో ప్రభుత్వం, ఏసీబీ అన్ని శుభమూహూర్తాలు చూసుకునేసరికి అసలు నిందితుడు వాటి కళ్లుగప్పి జారుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఆయన కోసం విదేశాల్లో వెతుకుతుందా.. ఇంకేం చర్యలు తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వ అలసత్వం, సకాలంలో కేసును కొలిక్కి తీసుకురాలేక పోవడం వల్లే వెంకటరెడ్డి ముందుగానే తన దారి చూసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రక్షణ రంగంలో కోస్ట్‌గార్డ్‌ సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ అధికారి (ట్రైనింగ్‌)గా ఉన్న వెంకటరెడ్డి.. 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో పనిచేశారు. తర్వాత గనుల శాఖ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇసుక అమ్మకం కాంట్రాక్టు టెండర్లు, నిర్వహణతోపాటు అనేకానేక అంశాల్లో వెంకటరెడ్డి కేంద్రంగా అవినీతి, అక్రమాలు జరిగాయని కొత్త ప్రభుత్వం భావించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో రోజే అంటే జూన్‌ 7న ఆయనపై బదిలీ వేటు వేసింది. తదుపరి పోస్టింగ్‌ కోసం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన పట్టించుకోకపోగా.. విజయవాడ విడిచివెళ్లారు. జూలై 31న వెంకటరెడ్డి డిప్యుటేషన్‌ గడువు ముగిసింది. సర్కారు అప్పటికప్పడు మేల్కొని అదే రోజున ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

3 నెలలుగా దాగుడుమూతలు..

వెంకటరెడ్డి ఇసుక టెండర్లు, అమ్మకాల ప్రక్రి యలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విచారణ చేయాలని గనుల శాఖ డైరెక్టర్‌ జూలై 27వ తేదీన ప్రభుత్వానికి లేఖరాశారు. జూలై 31నే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. సస్పెన్షన్‌ సమయంలో హెడ్‌క్వార్టర్‌ వదిలివెళ్లకూడదని ఆదేశించింది. చెప్పకుండా అమరావతి విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. కానీ ఆ ఆదేశాలను వెంకటరెడ్డి లెక్కచేయలేదు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ నుంచి సీఎస్‌కు లేఖ వెళ్లింది. సీఎస్‌ ఆగస్టు 7న సమగ్ర విచారణకు అనుమతించారు. మర్నాడు ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. సెప్టెంబరు 11న వెంకటరెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడ్రోజులకే ఆయనపై బదిలీ వేటు పడింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించలేదు. పత్తా లేకుండా పోయారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఉంటే..

అప్పుడే ఆయన ఎక్కడున్నారో తెలుసుకునే అవకాశం ఉండేది. సస్పెన్షన్‌ ఉత్తర్వులు తీసుకునేందుకు కూడా ఆయన అందుబాటులో లేరు. ఆగస్టు 31న వెంకటరెడ్డి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఈ నెల రెండో వారంలో ఆయన అమరావతికి వచ్చి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేసిందని, తనపై తీసుకున్న చర్యలను పక్కనపెట్టేలా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఆ వెంటనే తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఇది జరిగిన మూడ్రోజులకు.. అంటే ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత వెంకటరెడ్డి కోసం గాలింపు చేపట్టింది. కడప, తిరుపతి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపినా ఆయన జాడ తెలియలేదు. 11వ తేదీకి ముందే ఆయన ఆయన దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఎలాంటి చర్యలకు దిగుతుందో ఆయన ముందుగానే పసిగట్టారు. ప్రతి కీలకమైన సమాచారాన్నీ పొందగలిగారు. అందుకే చాలా వ్యూహాత్మకంగా.. కేసు నమోదుకు ముందే విదేశాలకు సేఫ్‌గా పారిపోగలిగారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Sep 16 , 2024 | 03:46 AM