Share News

నిరంతర వైద్యం

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:36 AM

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గు ముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సి. హరికిరణ్‌ తెలిపారు.

నిరంతర వైద్యం

వరద ప్రభావిత ప్రాంతాల్లో

శిబిరాలు.. సంచార వైద్యశాలలు

6 రకాల మందులతో కిట్ల పంపిణీ

ఆరోగ్యశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గు ముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సి. హరికిరణ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల వైద్య సేవలు, మందులను నిరంతరం అందించే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అత్యవసర ఔషధాల కిట్లు, 104 సంచార వైద్యశాలల్లో మందుల పంపిణీని బుధవారం ఆయన పరిశీలించారు. సితార సెంటర్‌, భవానీపురం, స్వాతి థియేటర్‌ ప్రాంతాల్లో పర్యటించి మందుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ఎవరెవరికి ఏయే మందులు అందిస్తున్నారు? అత్యవసర సమయంలో ఇస్తున్న ఔషధాలేంటి అనే వివరాలను డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి కొరత లేకుండా సంబంధిత మందులను పంపిణీ చేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు. 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని, రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని 32 వార్డులతోపాటు 5 గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. అనుబంధంగా సంచార వైద్యశాలలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ శిబిరాల్లో 200 రకాల మందులు సిద్ధంగా ఉంచామని, వైద్య సేవలు అందించడంలో తగిన సూచనలు, సలహాల కోసం ఉన్నతాధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్‌ రూమ్‌ను కూడా సిద్ధం చేసినట్టు వివరించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న 32 వార్డుల్లో అందరికీ 6 రకాల అత్యవసర మందుల కిట్లను, వాటిని వాడే విధానాన్ని వివరించే కరపత్రాలను అందజేసినట్టు తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 07:45 AM