పెన్షనర్ల సమస్యలపై సీఎం సానుకూలం
ABN , Publish Date - Oct 31 , 2024 | 03:58 AM
పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు తెలిపారు.
అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని హామీ
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలపై తాము సీఎంను కలిశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు. పెన్షనర్లు, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఆర్థిక పరిస్థితిని మీరూ చూస్తున్నారు కదా.. రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం అన్నారని పూర్ణచంద్రరావు తెలిపారు. గత ప్రభుత్వం తగ్గించిన క్వాంటం ఆఫ్ పెన్షన్ 3 శాతాన్ని వెంటనే పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. డీఏ బకాయిలు కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి దశల వారీగా చెల్లిస్తామని చెప్పారన్నారు. డిసెంబరు 17ను పెన్షనర్ల డేగా ప్రభుత్వం తరఫున నిర్వహించాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎంను కోరామని తెలిపారు. ’