గురుకులాలకు పౌరసరఫరాల సేవలు
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:03 AM
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకుగాను పౌరసరఫరాల శాఖ సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
నిత్యావసర వస్తువుల సరఫరాకు ఏర్పాట్లు
సంక్షేమ హాస్టళ్లకు కూడా పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా సరుకుల సేకరణకు టెండర్లు
జిల్లా నుంచి రాష్ట్రస్థాయి టెండర్లకు మార్పు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకుగాను పౌరసరఫరాల శాఖ సేవలు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, హాస్టళ్లకు ప్రొవిజన్స్ సరఫరా స్థానికంగా టెండర్లు పిలవడం ద్వారా చేపట్టేవారు. జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కొనుగోలు కమిటీ ఈ టెండర్లు నిర్వహించేది. దీంతో అవసరమైన వస్తువులను హాస్టళ్లు, గురుకులాలు ఎప్పటికప్పుడు స్థానికంగా సమకూర్చుకునేవి. ఏడాదికోసారి టెండర్లు నిర్వహించి సంవత్సరమంతా అదే రేట్లతో సరఫరా చేసేవారు. ప్రభుత్వం ఇప్పుడు టెండర్ల ప్రక్రియలో మార్పులు చేసింది. పౌరసరఫరాల శాఖ ద్వారా రాష్ట్రస్థాయి టెండర్లు పిలిచి ప్రధానమైన ప్రొవిజన్లను సేకరించనుంది. వాటిని పౌరసరఫరాల శాఖ ఎంఎల్ పాయింట్ల ద్వారా గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేయనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రొవిజన్ సరఫరాదారులు ఎక్కువ మంది లేకుండా కార్పొరేట్ స్థాయిలో టెండర్లు ప్రక్రియ చేపట్టారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం: సరఫరాదారులు
పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులు సేకరించి సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుందని సరఫరాదారులు అంటున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. పౌరసరఫరాల శాఖ భారీ రేట్లతో సరుకులను సేకరిస్తోందని.. మార్కెట్ రేటుకు, పౌరసరఫరాల శాఖ ఇచ్చే రేట్లకు భారీ వ్యత్యాసముందని చెప్తున్నారు. గతంలో తాము సరుకులు సరఫరా చేసేటప్పుడు 10 శాతం తేడాతో వస్తువులు సరఫరా చేసేవారమని, ఇప్పుడు పౌరసరఫరాల శాఖ ద్వారా 20-30 శాతం వ్యత్యాసముందని పేర్కొంటున్నారు. కార్పొరేట్ సరఫరాదారులకు ప్రయోజనం కలిగించేలా ఈ సేకరణ జరుగుతోందని, ప్రభుత్వం ఈ టెండర్ల ప్రక్రియపై పునరాలోచించాలని కోరుతున్నారు. అంతేకాకుండా సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల సిబ్బంది ఎంఎల్ పాయింట్ల నుంచి సరుకులు తెచ్చుకోవడం కష్టమవుతుందంటున్నారు. ఒక్క బియ్యం సరఫరా విషయంలోనే పౌరసరఫరాల శాఖ విఫలమై, పిల్లలకు సరైన బియ్యం అందించలేకపోతోందని, ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా ఆ శాఖ సరఫరా చేస్తే ఏ మేరకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేస్తుందోనంటూ పలువురు ప్రిన్సిపాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన వస్తువులు సరఫరా చేస్తే అదే చాలని, ఎవరు సరఫరా చేసినా తమకు కావాల్సింది నాణ్యమైన సరుకులేనని అంటున్నారు.