Share News

Varasiddha స్వర్ణ శేషుడిపై వరసిద్ధుడు

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:04 AM

కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం వరసిద్ధుడు స్వర్ణ శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, కాణిపాకం,వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె,తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

 Varasiddha స్వర్ణ శేషుడిపై వరసిద్ధుడు
రాత్రి స్వర్ణ శేష వాహనంపై ఊరేగుతున్న ఉత్సవర్లు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 11: కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం వరసిద్ధుడు స్వర్ణ శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, కాణిపాకం,వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె,తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాన్ని, ధ్వజ స్తంభాన్ని, సుపథ మండపాన్ని వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు పంచామృత అభిషేకాన్ని నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుడు చిన్నశేష వాహనంపై పురవీధులలో ఊరేగారు. రాత్రి ఉభయ వరస రావడంతో కల్యాణ వేదిక వద్ద సిద్ధి,బుద్ధి సమేత గణపతి ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. స్వర్ణ పెద్దశేష వాహనంపై ఉత్సవర్లను కాణిపాకంలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మురళీ మోహన్‌, గురజాల జగన్మోహన్‌, జడ్పీటీసీ సుచిత్ర, ఆలయ ఈవో గురుప్రసాద్‌, ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, మాజీ చైర్మన్‌ మణినాయుడు, మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌రావు, మాజీ జడ్పీటీసీ లత, రైతు నేత గంగారపు హరిబాబునాయుడు, ఉభయదారుల సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌బాబు, ఉభయదారులు పాల్గొన్నారు.

వేడుకగా కలశ ఊరేగింపు

శేష వాహనం సందర్భంగా బుధవారం మణికంఠేశ్వరస్వామి ఆలయం నుంచి ఉభయదారులు పాలు కలిగిన కలశాలను తలపై పెట్టుకుని మాడ వీధుల గుండా ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపులో కేరళ వాయిద్యాలు, బాజాభజంత్రీలు, కోలాటాలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం కల్యాణ వేదికపై సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లకు అభిషేకం.. ఆ తర్వాత పుష్పయాగం నిర్వహించారు.

కాణిపాకంలో నేడు

గురువారం ఉదయం చిలక వాహనం, రాత్రి వృషభ వాహన సేవను నిర్వహించనున్నారు. ఉదయం సేవకు కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు.. రాత్రి వాహన సేవకు కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరుకు చెందిన శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 03:04 AM