Tribute-నారా రామ్మూర్తికి ఘన నివాళి
ABN , Publish Date - Nov 29 , 2024 | 01:53 AM
సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో జరిగాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు, మంత్రి లోకేశ్‌తో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు, ప్రముఖులు నివాళులర్పించారు.
పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖుల హాజరు
తిరుపతి/చంద్రగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో జరిగాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు, మంత్రి లోకేశ్‌తో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు, ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద రామ్మూర్తి నాయుడు కుమారులు నారా రోహిత్, గిరీ్‌షతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ ప్రకారం పెద్దకర్మ నిర్వహించారు. ఆ తర్వాత సభావేదికపై రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భోజనశాలకు వెళ్లి ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అందరితో ఆత్మీయంగా పలకరించారు. అక్కడనుంచి తిరిగి ఇంటికి చేరుకున్నారు.
హాజరైన ప్రముఖులు.. స్థానికులు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సరావు, మంత్రులు కె.అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎం.రాంప్రసాదరెడ్డి, వి.అనిత, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి (పలమనేరు), కిశోర్‌కుమార్‌రెడ్డి (పీలేరు), మురళి (పూతలపట్టు), పులివర్తి నాని (చంద్రగిరి), ఆదిమూలం (సత్యవేడు), గాలి భానుప్రకాష్ (నగరి), గురజాల జగన్మోహన్ (చిత్తూరు), బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), షాజహాన్ బాషా (మదనపల్లె), దూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), థామస్ (గంగాధర్ నెల్లూరు) శ్రీనివాసులు (రాయదుర్గం), మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సీకే బాబు, ఏఎస్ మనోహర్, నెలవల సుబ్రహ్మణ్యం, టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవి నాయుడు, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ, అన్నా అనిత, నరసింహాచారి, కూటమి పార్టీల నేతలు, శ్రేణులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.
శివాలయానికి వెళ్లి..
సీఎం చంద్రబాబునాయుడు, నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, రామ్మూర్తినాయుడి సతీమణి ఇందిర, నారా గిరీష్, నారా రోహిత్, సీఎం సోదరి హైమావతి తదితరులు గురువారం సాయత్రరం శేషాపురం వద్ద శేషాచల లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
సీఎం పరామర్శ
నారావారిపల్లెలో ఇటీవల మృతిచెందిన నారా చిన్నబ్బనాయుడి ఇంటికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. చిన్నబ్బ సతీమణి సావిత్రి, కుమారుడు నారా కిరణ్‌ను పరామర్శించారు. కందులవారిపల్లెలో ఇటీవల మృతిచెందిన పులివర్తి హరిహరచౌదరి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. సంప్రదాయం ప్రకారం రాత్రి నారా గిరీష్, నారా రోహిత్ గ్రామంలోని అన్ని ఇళ్లకు వెళ్లి దీపం చూశారు.
నేడు సీఎం తిరుగు ప్రయాణం
తిరుపతి (నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: సీఎం చంద్రబాబు శుక్రవారం అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు నారావారిపల్లెనుంచి బయలుదేరి 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడ్నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రి లోకేశ్ గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
భారీ భద్రత
నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రావడంతో గురువారం పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి నివాసంలోకి అనుమతి ఉన్నవారిని మాత్రమే మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేసి అనుమతించారు. చాలామంది నాయకులను సీఎం నివాసంలోకి పోలీసులు అనుమతించలేదు. దీనిపై కొందరు పోలీసులతో వాదనకు దిగారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో ప్రధాన ద్వారం వద్ద తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ రవికుమార్, సీఐ అహమ్మద్, పోలీసులు బందోబస్తు చేపట్టాయి. భోజనశాల, వేదిక, సభా ప్రాంగణం, సీఎం ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి. డాగ్ స్క్వాడ్లతో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు డీఐజీ షిమోషి, ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. కాగా, గురువారం రాత్రి చంద్రబాబు నారావారిపల్లెలో బస చేయడంతో పోలీసులు సీఎం ఇంటి చుట్టూ భద్రత పెంచారు.