permission అనుమతి కోసం హాయ్ చెప్పండి
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:11 AM
వినాయక చవితి వేడుకల్లో భాగంగా విగ్రహాలు ప్రతిష్టించే మండపాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫ చవితి వేడుకలకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం
తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 4: వినాయక చవితి వేడుకల్లో భాగంగా విగ్రహాలు ప్రతిష్టించే మండపాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వేడుకలు నిర్వహించాలంటే అగ్నిమాపక, విద్యుత్తు, పురపాలక , పోలీసు శాఖల నుంచి అధికారుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. వీటి కోసం అధికారుల చుట్టూ చవితి వేడుకల నిర్వాహకులు రోజుల తరబడి ప్రదక్షిణ చేసే వారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంతో ఇంటి నుంచే అనుమతులను పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయడం లేదా దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయడం వలన ఇట్టే వినాయక విగ్రహ ఏర్పాటుకు అనుమతులు పొందే వెసులుబాటును ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఫ చవితి వేడుకలు నిర్వహించే వారు కచ్చితంగా ఉత్సవ కమిటీని నియమించుకోవాలి. వారిలో ఒకరి సెల్‌ఫోన్ నుంచి 79950 95880 నంబరుకు వాట్సా్‌పలో హాయ్ అని మెసేజ్ పంపించాలి. వెంటనే సదరు నంబరుకు లింక్ వస్తుంది. దాన్ని అనుసరించాలి. లేకుంటే నేరుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గణే్‌షఉత్సవ్.నెట్ అనే వెబ్‌సైట్‌లో అడిగిన పూర్తి వివరాలను నమోదు చేయడంతో అందులో ఇచ్చిన మన సెల్ నంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే గూగుల్లో ధరఖాస్తు వస్తుంది. అందులో అడిగిన వివరాలను పూరించాల్సి ఉంటుంది. దానిని పోలీసులు, ఇతర శాఖల అధికారులు పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత బాధ్యుడి పేరుతో క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ డౌన్‌లోడ్ చేసి విగ్రహం ఏర్పాటు చేసే మండపం వద్ద అంటించాల్సి ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే విగ్రహానికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడవుతాయి.