Salute గురువులకు వందనం!
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:35 AM
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువల బోధనకు ప్రాధాన్యత వుండేది. ప్రత్యేకంగా దానికంటూ కొన్ని క్లాసులు తీసుకునేవారు. పాఠ్యాంశాల్లో కూడా నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తాలు వుండేవి.
- తిరుపతి కలెక్టర్ డాక్టర్ సంజామల వెంకటేశ్వర్
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువల బోధనకు ప్రాధాన్యత వుండేది. ప్రత్యేకంగా దానికంటూ కొన్ని క్లాసులు తీసుకునేవారు. పాఠ్యాంశాల్లో కూడా నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తాలు వుండేవి. ఇపుడు వాటిని తగ్గించేయడం, పూర్తిగా తొలగించడం చేస్తున్నారు. ప్రాధమిక విద్యలో పిల్లలకు మాతృభాషలోనే సబ్జెక్టులు బాగా అర్థమవుతాయి. దానికోసం తెలుగు భాషా బోధనపై దృష్టి సారించాల్సిన అవసరముంది.
పాఠశాలల్లో కేవలం పాఠ్యపుస్తకం చదివి టీచ్ చేయడం సరిపోదు. అవసరమైన బొమ్మలు, దృశ్యాలు, మ్యాపులు, డ్రాయింగులు వంటివి ఉపయోగించాలి. ఉదాహరణలు చూపాలి. కేవలం కాన్సె్‌ప్టలు మాత్రమే బోధిస్తే పిల్లలకు అర్థం కాదు. వీటన్నింటికీ మించి సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు పిల్లల పాలిట మెంటర్లుగా మారాలి.
చిన్ననాట గురువులు విద్యార్ధుల ఆలోచనల్లో నాటిన విత్తనం.. చదువులోనే కాదు వ్యక్తిత్వ వికాసంలోనూ కీలకంగా మారుతుంది. అందుకే ఏ స్థాయికి ఎదిగినా గురువులను తలచుకుంటారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంజామల వెంకటేశ్వర్.. తనకు దారి చూపిన గురువులను ఇలా గుర్తు చేసుకుంటూ నమస్కరించుకుంటున్నారు.
హైస్కూల్‌లో సెబాస్టియన్ సార్
ఫస్ట్ క్లాస్ నుంచీ టెన్త్ వరకూ గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా. అప్పట్లో మాకు కెమిస్ట్రీ టీచర్‌గా సెబాస్టియన్ వుండేవారు. కేవలం తన సబ్జెక్టుకే పరిమితమయ్యేవారు కాదు. ఇతర అంశాలు చెప్పేవారు. మంచిచెడులు వివరిస్తూ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నించేవారు. హైస్కూలు స్థాయి లోనే కెరీర్ వైపు దృష్టి మళ్ళించారు. నాకు కూడా కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి గైడ్ చేసింది తనే.
సివిల్స్ దిశగా.. ప్రొఫెసర్ కృష్ణబాబు
విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్న సమయంలో ఎస్పీఎం (సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రొఫెసర్ కృష్ణబాబు టీచింగ్ నన్ను బాగా ప్రభావితం చేసింది. సివిల్స్ వైపు దృష్టి మరల్చింది కూడా వారే. జీవితంలో తల్లిదండ్రుల్ని మినహాయిస్తే నన్ను ఓ వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ఈ ఇద్దరి పాత్ర ఎక్కువ. గురుపూజోత్సవ దినాన వారిని గుర్తు చేసుకుంటూ వందనం సమర్పించుకుంటున్నా.
అర్థశాస్త్ర నిపుణుడైన ఆచార్య కూతాటి వెంకటరెడ్డి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకుడిగా 36 ఏళ్లు ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. అనంతపురం ఎస్కే యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా చేసి రిటైరైన ఆయన ప్రస్తుతం తిరుపతి ఎస్వీ నగర్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 93 ఏళ్ల వెంకటరెడ్డి ఇటీవలే తన ఆత్మకథ రాశారు. అందులో చిన్ననాట తనకు చదువు చెప్పిన గురువులను ఇలా గుర్తు చేసుకున్నారు.
ఆ కాలంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్పు వసతి లేదు. హెడ్‌మాస్టర్ ఆర్.టి. రంగారెడ్డి, చెంగారెడ్డి, రంగస్వామి అయ్యంగారు ఇత్యాది టీచర్లంతా కూడా స్తోమత లేని పిల్లలకు పరీక్ష ఫీజులు కట్టి మరీ పరీక్షలు రాయించేవారు. అట్టి నిబద్ధత ఆనాటి ఉపాధ్యాయులది.
స్వాతంత్ర్యోద్యమంలోకి నడిపిన గురువు
‘‘ధనోజివారిపల్లె మావూరు. ఆ కాలంలో ప్రాథమిక పాఠశాల కూడా మావూర్లో లేదు. పాకాల బడిలో చేరాను. పాకాల మావూరికి అయిదు మైళ్లు. రానూపోనూ పదిమైళ్ల నడక. మా హైస్కూల్లో రంగస్వామి అయ్యంగార్ అని ఒక ఉపాధ్యాయుడు వుండేవారు. తిరుచానూరు నివాసి. రైల్లో రోజూ పాకాలకి వచ్చేవారు. ఒకరోజు రైలు ఆలస్యం మూలాన 5నిమిషాలు లేటుగా వచ్చారు. అంతే,ఆ రోజు సెలవు పెట్టి సాయంకాలం దాకా అక్కడే ఉన్నారు. పాఠశాల వదిలాక ఆరోజు మాకు చెప్పవలసిన పాఠం చెప్పారు. క్రమశిక్షణలో ఆయన అంతటి ఘనాపాటి! ఒకసారి నేను జబ్బుపడి వరసగా మూడురోజులు పాఠశాలకు వెళ్లలేదు. అప్పుడు రంగస్వామి అయ్యంగార్ 5 మైళ్లు పాకాల నుంచీ నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి పళ్లూ ఫలాలూ ఇచ్చి మళ్లీ నడుచుకుంటూ మా వూర్నించి పాకాల వెళ్లి అక్కడ రైలెక్కారు తిరుపతికి. అంతటి ఆప్యాయత వారికి విద్యార్థులంటే! 1943లో గాంధీ బొంబాయి నుంచి రేణిగుంట మీదుగా మద్రాసుకు ప్రయాణిస్తున్నారని తెలిసింది. రంగస్వామి అయ్యంగార్‌తో కలసి 30 మంది విద్యార్థులం రేణిగుంటకు వెళ్లాము. గాంధీని దర్శించిన మొదటి సందర్భం అది. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణోద్యమాల్లో 8,9 తరగతుల్లో వుండగా నేను చురుగ్గా పాల్గొన్నాను. అది చూసి రంగస్వామి అయ్యంగార్ మా పాఠశాల విద్యార్ధులతో ‘పాకాల కాంగ్రెస్ స్టూడెంట్స్ అసోసియేషన్’ అని స్థాపించి నన్ను అధ్యక్షుడిని చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నన్ను 6 మాసాలు చిత్తూరు జైలులో వుంచారు. అయినా ఏనాడూ పరీక్ష తప్పింది లేదు.