Regulation-లాటరీల నియంత్రణ
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:35 AM
లాటరీ టికెట్ల అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా జరిగిన లాటరీ టికెట్ల అమ్మకాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. గత సోమవారం జిల్లా ప్రత్యేక విభాగ పోలీసులు పలమనేరు, పుంగనూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో దాడులు చేసి ఏకంగా రూ.13 లక్షల విలువ చేసే 22 వేల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
టికెట్ల అమ్మకాలపై పోలీసుల దాడులు
చిత్తూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):లాటరీ టికెట్ల అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా జరిగిన లాటరీ టికెట్ల అమ్మకాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. గత సోమవారం జిల్లా ప్రత్యేక విభాగ పోలీసులు పలమనేరు, పుంగనూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో దాడులు చేసి ఏకంగా రూ.13 లక్షల విలువ చేసే 22 వేల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫ లాటరీ టికెట్ల నిర్వహణ ఇలా
రూ.20, 50, 100, 200, 250, 500 చొప్పున విక్రయించే లాటరీ టికెట్ల వ్యాపారం జిల్లా కేంద్రం చిత్తూరు సహా.. పలమనేరు, పుంగనూరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో ఎక్కువగా జరిగేది.రోజూ ఉదయం టికెట్లను అమ్మి సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించేవారు. తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం, వేలూరు ప్రాంతాల్లో లాటరీ టికెట్ల డిస్ర్టిబ్యూషన్ కేంద్రాలున్నాయి. అక్కడి నుంచి టికెట్లను తెచ్చుకుని జిల్లాలో విక్రయిస్తుంటారు. ఒక్కసారి లాటరీ తగిలినా తమ బతుకులు బాగుపడిపోతాయని ఆశపడే అమాయకులే వీరి ఖాతాదారులు.పోలీసులు కూడా నెల మామూళ్లు తీసుకుని నిర్వాహకుల జోలికి వెళ్లేవారు కాదు.నిర్వాహకుల వెనుక రాజకీయ నాయకులుండి, వచ్చిన డబ్బుల్లో సింహభాగం తీసుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి మారింది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఐదు నెలలుగా లాటరీ నిర్వహణ లేదు.కొందరు టీడీపీ నాయకులు నిర్వహించాలని చూసినా.. ఎమ్మెల్యే జగన్మోహన్ కల్పించుకుని ఆపేయించారు. పుంగనూరు, పలమనేరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో లాటరీ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం వారు ఆయా ప్రాంతాల్లో దాడులు చేశారు. పుంగనూరులోని తూర్పుమొగశాల, కేకేనగర్, బంగారుపాళ్యం, పలమనేరుల్లో రూ.13 లక్షల విలువ చేసే 22 వేల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు పెట్టారు.లాటరీ టికెట్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించే దిశగా పోలీసు శాఖ ముందుకెళుతోంది.