చిన్న ఆధారమూ దొరకలేదు!
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:52 PM
అదృశ్యమైన ఆరేళ్ల బాలిక ఆచూకీకి సంబంధించి చిన్న ఆధారమూ దొరక్కపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు
పుంగనూరు, అక్టోబరు 1: అదృశ్యమైన ఆరేళ్ల బాలిక ఆచూకీకి సంబంధించి చిన్న ఆధారమూ దొరక్కపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్‌లో కాపురం ఉండే వడ్డీ వ్యాపారి అజ్మతుల్లా కుమార్తె ఆస్పియా (6) ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటూ కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. ఆస్పియా ఆచూకీ కోసం నేరపరిశోధనలో పేరుగాంచిన పోలీసు అధికారుల నేతృత్వంలో 11బృందాలు విస్తృత గాలింపు సాగిస్తున్నాయి.సోమ, మంగళవారాల్లో ఎస్పీ మణికంఠ పుంగనూరులోనే మకాం వేసి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.డీఎస్పీలు ప్రభాకర్, సాయినాథ్, ఇలియా్‌సబాషా, చిత్తూరు స్పెషల్ బ్రాంచి, పుంగనూరు సీసీఎస్, గంగవరం సీఐలు భాస్కర్, శ్రీనివాసులు, ఉమామహేశ్వరరావు,ప్రసాద్, పలువురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు గాలింపుతో పాటు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. మంగళవారం మున్సిపల్ కార్మికులు, కొందరు యువకుల ద్వారా పట్టణం చుట్టూ ఉన్న కాల్వలు, బావులు, చెరువులు, ముళ్లపొదలు, అనుమానిత ప్రాంతాల్లో గాలించారు.పుంగనూరు పట్టణంతో పాటు శివార్లలోని సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. బాలిక తండ్రి అజ్మతుల్లా వడ్డీ వ్యాపారి కావడంతో ఇటీవల వ్యాపారంలో ఏవైనా గొడవలు జరిగాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.సెల్‌ఫోన్ టవర్‌సిగ్నళ్లను విశ్లేషించడంతో పాటు, నేరచరిత్ర కలిగినవారి కదలికలపై వాకబు చేస్తున్నారు.అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నా చిన్నపాటి క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ నుంచి సాంకేతిక పోలీసు బృందం వస్తున్నట్లు సమాచారం.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి:డీఐజీ
అదృశ్యమైన ఆస్పియా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీఐజీ షిమోషిబాజ్‌పేయి ఆదేశించారు. మంగళవారం రాత్రి పుంగనూరు స్టేషన్‌లో ఆమె ఎస్పీ మణికంఠ, డీఎస్పీలు ప్రభాకర్, సాయినాథ్, ఇలియా్‌సబాషాలతో కేసు గురించి చర్చించారు. సున్నితమైన విషయం కావడంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.బాలిక తల్లిదండ్రులతో పాటు మరికొందరిని విచారించారు.