Share News

కుప్పం గంగజాతర

ABN , Publish Date - May 21 , 2024 | 02:20 AM

శిరస్సులేని దేహానికి ఏడాదికోసారి జరిగే వేడుకలే కుప్పం జాతర ఉత్సవాలు. ఇక్కడ కొలువైన ప్రసన్న తిరుపతి గంగమాంబ ఏడాదిలో ఒకే ఒక్కరోజు మాత్రమే జాతరలో శిరస్సుతో కనిపిస్తుంది.

కుప్పం గంగజాతర
గంగమ్మ శిరస్సు ఊరేగింపు (ఫైల్‌ ఫొటో) - పూజలందుకుంటున్న అమ్మవారి అసంపూర్ణ దేహం

శిరస్సులేని దేహానికి పూజలు

ఖండిత శిరస్సుకు ఊరేగింపు

కుప్పం, మే 20: శిరస్సులేని దేహానికి ఏడాదికోసారి జరిగే వేడుకలే కుప్పం జాతర ఉత్సవాలు. ఇక్కడ కొలువైన ప్రసన్న తిరుపతి గంగమాంబ ఏడాదిలో ఒకే ఒక్కరోజు మాత్రమే జాతరలో శిరస్సుతో కనిపిస్తుంది. సంపూర్ణశక్తిగా దర్శమిచ్చే అమ్మవారిని కొలిచి తరించేందుకు అందుకే ప్రజలు కుప్పం జాతర కోసం ఇంతగా ఎదురు చూస్తారు. జాతరలో నేడు అమ్మవారి శిరస్సు ఊరేగింపు, బుధవారం విశ్వరూప దర్శనం ఉంటాయి. ఏడాది పొడవునా తెర వెనుకనే ఉండిపోయిన శిరస్సులేని గంగమ్మకి జాతర రోజుల్లో మాత్రమే తెర తొలగించి పూజలు చేస్తారు. అయితే పక్కనే ముత్తుమారెమ్మ రూపంలో గంగమాంబ ఏడాదంతా సేవలందుకుంటుంది. ఈ వారం రోజులూ శిరస్సు భాగంలో వేపమండలు అమర్చిన అమ్మ అసంపూర్ణ దేహం పూజలందుకుంటుంది. జాతరకు ఏపీ, తమిళనాడునుంచి భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తారు. కుప్పం పరిసర గ్రామాలలోనూ వేడుకలు చేసుకుంటారు. జాతరకోసం దూర ప్రాంతాలలో ఉన్న తమ బంధుమిత్రులకు ఆహ్వానం పంపుతారు. మాంసాహార వంటకాలతో విందులు చేస్తారు.

వారం రోజుల సంబరాలు: కుప్పం గంగమ్మ జాతర మే నెలలో జరుగుతుంది. వారం రోజులపాటు సంబరాలు ఉంటాయి. ముత్తుమారెమ్మకు వాహన సేవలు నిర్వహిస్తున్నారు. మొదటిరోజున పల్లకీ సేవ, రెండు, మూడు, నాల్గవ రోజుల్లో శేష, సింహ, అశ్వ వాహన సేవలు, ఐదవ రోజున అగ్నిగుండ మహోత్సవం, పుష్ప పల్లకీ సేవలు జరిగాయి. ఆరవ రోజైన మంగళవారం గంగమ్మ శిరస్సును పట్టణ వీధుల్లో ఊరేగిస్తారు. 25-39 గంటలపాటు ఊరేగింపు సాగుతుంది. అనంతరం శిరస్సును తీసుకొచ్చి ఆలయంలో అసంపూర్ణంగా ఉన్న అమ్మవారి మొండేనికి అమరుస్తారు. ఏడవ రోజున బుధవారం నాడు భక్తులకు అమ్మవారు శిరస్సుతో విశ్వరూప దర్శనం ప్రసాదిస్తారు. ఈ రెండు రోజులూ భక్తులు వివిధరకాలైన వేషధారణలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. విశ్వరూప దర్శనం అనంతరం తెల్లవారు ఝామున గంగమ్మను జలావాసం చేయించడంతో జాతర ముగుస్తుంది.

బలులు: శిరస్సు ఊరేగింపు, విశ్వరూప దర్శనాల రోజుల్లో విరివిగా జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రెండు రోజులూ కుప్పం వీధులు రక్తసిక్తమవుతాయి. ఇలా చేయడంవల్ల అమ్మవారిలోని ఉగ్రత ఉపశమించి, ప్రసన్నంగా మారి కోరిన వరాలిస్తారని నమ్మకం.

గంగమ్మ శిరస్సు కత...

గంగమ్మకు తల ఏమైందన్నదానిపై జానపద ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఆ కథ ఇదీ.. ఏడుకొండల మీద ఉండే శ్రీనివాసుడికి గంగమ్మ చెల్లెలు. అన్న శాంతస్వభావి అయితే, చెల్లెలు ఉగ్రరూపి. ఆగ్రహోదగ్రియైు తిరిగేది. రూపు భీకరంగా ఉండేది. రాత్రివేళ శ్మశానాల్లో తిరుగులాడేది. కోపావేశంలో శవాలను పీక్కుతినేది. గంగమ్మను చూసి జనం భయంతో వణికిపోయేవారు. అందరూ కలిసి ఏడుకొండలెక్కి స్వామికి మొరపెట్టుకున్నారు. చెల్లెలి భీకర చేష్టలు విన్న వేంకటేశ్వరుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. కుప్పానికి వచ్చి చెల్లెలి తీరు చూశాడు. అంతే చెల్లెలని కూడా చూడకుండా చక్రం వదిలి ఆమె తల ఒక్కవేటుకి నరికేశాడు. తెగిపడ్డ తల నెత్తురోడుతూనే రోదించింది. అన్నను వేడుకుంది. దాంతో శాంతించిన ఆయన ఏడాదిలో ఒక్కరోజు మాత్రం శిరస్సును ధరించి సంపూర్ణ రూపంలో కనిపిస్తావు. భక్తుల పూజలు అందుకుంటావు అని వరమిచ్చాడు. ఆ ప్రకారమే ఏడాదికోసారి విశ్వరూప దర్శనం. జాతర సంబరాలు అని ప్రజల నమ్మకం. సృష్టిలో ఏదీ సంపూర్ణం కాదు అనేందుకు ఈ జాతర సంకేతమని కూడా విశ్లేషిస్తారు.

చిత్తూరులో నేడు నడివీధి గంగమ్మ జాతర

చిత్తూరు కల్చరల్‌, మే 20: చిత్తూరులో మంగళవారం నడివీధి గంగజాతర జరగనుంది. కోసం ఉత్సవ మంటపం వద్ద సోమవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాడానికి బారికేడ్లు, చలువ పందిళ్లు, మంటపానికి విద్యుత్తు దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీస్‌ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. మంగళవరం ఉతవయం వంశపారంపర్య ధర్మకర్త సీకే జయచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశాక భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి అంబలి సమర్పిస్తారు. రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు చేయడానికి అనువుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా, బుధవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా కట్టమంచి రైల్వే అండర్‌బ్రిడ్జి సమీపంలోని గంగజాతర బావి వద్దకు తీసుకొచ్చి నిమజ్జన పూజలు చేసి నీటిలో అమ్మవారిని కలపడంతో గంగజాతర ముగుస్తుంది.

వైభవంగా అగ్నిగుండ మహోత్సవం

భారీ వర్షం నడుమ పోటెత్తిన భక్తజనం

కణకణ మండుతున్న నిప్పుల గుండం. భీకరాకారంలో ముత్తుమారెమ్మ రూపం. భక్తిపారవశ్యంలో భక్తలోకం. భారీ వర్షం నడుమ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం వొళ్లు గగుర్పొడిచే రీతిలో సాగి, భక్తకోటికి తన్మయత్వాన్ని కలిగించింది. గంగ జాతర మహోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి ముత్తుమారెమ్మ అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరిగింది. ముత్తుమారెమ్మ ఉత్సవమూర్తిని పల్లకీపై ఊరేగింపుగా అగ్నిగుండం వద్దకు వేంచేపు చేశారు. ఆకుపచ్చటి ఛాయతో, విశాలమైన ఎర్రటి కనుగుడ్లతో భీకరంగా ఉన్న అమ్మవారి స్వరూపం భక్తులకు భయానికి బదులు భక్తిని కలిగించింది. సరిగ్గా అమ్మవారు కదలి వచ్చే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. గుండం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి అమ్మవారు నిలిచిన తర్వాత, తొలుత గరికె పట్టుకున్న పూజారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం అమ్మవారి ప్రవేశం జరిగింది. శిరఃస్నానాలు ఆచరించి, ఎరుపు దుస్తులు ధరించి, చేత వేపమండలతో నీరోడుతున్న శరీరాలతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులూ ఒక్కొక్కరుగా కణకణమండే నిప్పుల కణికలపై నడిచారు. మూడు రాష్ట్రాలనుంచి తరలివచ్చిన భక్తజనులతో గంగమ్మ ఆలయ ప్రదేశం కిక్కిరిసింది.

చంద్రబాబు గంగజాతర శుభాకాంక్షలు

‘కుప్పంలో కొలువైన ప్రసన్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. అమ్మలగన్న అమ్మ ఈ గంగమ్మతల్లి దీవెనలు మనందరిపైనా ఉంది. మనందరికీ సుఖసంతోషాల్ని ప్రసాదించాల్సిందిగా ఆతల్లిని కోరుకుంటున్నాను. జై గంగమ్మతల్లి.. జైజై గంగమ్మతల్లి’ అంటూ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు సోమవారం ప్రజలకు గంగజాతర శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపించారు.

Updated Date - May 21 , 2024 | 02:20 AM