Share News

కన్నులపండువగా కల్యాణం

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:13 AM

వరసిద్ధుడికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు

కన్నులపండువగా కల్యాణం
మాంగళ్యాన్ని చూపుతున్న అర్చకులు ధర్మేశ్వర గురుకుల్‌ - కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఐరాల(కాణిపాకం),సెప్టెంబరు 15: కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.రథోత్సవం మరుసటి రోజున తన మానస పుత్రికలైన సిద్ధి,బుద్దిలతో పెళ్లిపెద్దగా బ్రహ్మ వ్యవహరించి వినాయకస్వామికి వివాహం జరిపిస్తారని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఉదయం ఉభయదారులైన కాణిపాకం, తిరువణంపల్లెలకు చెందిన వణిగ వంశస్థుల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అనంతరం కాణిపాక పురవీధుల్లో కలశాలతో పాలను తీసుకొని ఊరేగించారు.అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లకు పాలాభిషేకం నిర్వహించారు.కల్యాణోత్సవ సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్యామలరావు వరసిద్ధుడికి పట్టు వస్త్రాలను అందజేశారు.రాత్రి అలంకార మండపంలో ప్రత్యేక కల్యాణ మండప వేదికపైకి వధూవరులను తీసుకొచ్చి మంగళ వాయిద్యాల నడుమ శాస్ర్తోక్తంగా స్వామి వివాహం జరిపించారు.అనంతరం స్వామివారి ఊరేగింపులో భాగంగా గంగుండ్రి మండపం వద్ద స్వామివారు దోపిడికి గురయ్యారు.అత్తవారు కట్టించిన కుడుములు, ఉండ్రాళ్లు, చిల్లర కాసులను భక్తులు దోపిడి చేశారు. ఈ తంతు ముగియగానే కొంత సేపు స్వామివారిని, సిద్ధి,బుద్ధిని గంగుండ్రి మండపం వద్ద ఉంచి విద్యుత్‌ దీపాలను తొలగించారు. అనంతరం విద్యుత్‌ను పునరుద్ధరించి ఊరేగింపును కొనసాగించారు.ఈ వేడుకలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మురళీమోహన్‌,ఆలయ ఈవో గురుప్రసాద్‌, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి,విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి,విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ సిబ్బంది భిక్షాటన

వరసిద్ధుడి కల్యాణం జరిపించడం కోసం ఆదివారం మధ్యాహ్నం ఆలయ సిబ్బంది శివపార్వతుల వేషధారణలో కాణిపాక పుర వీధుల్లో భిక్షాటన నిర్వహించారు. అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భిక్షాటనకు వచ్చిన సిబ్బందికి యాత్రికులు, భక్తులు తమకు తోచిన భిక్ష వేశారు. ఆలయ పరిసర గ్రామాల్లో భిక్షాటన చేసి వచ్చిన నగదు, వస్తువులతో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఈవో గురుప్రసాద్‌,ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్‌గురుకుల్‌, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్లు మణినాయుడు,జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అశ్వ వాహనంపై ఊరేగిన శివ పుత్రుడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరసిద్ధుడు ఆదివారం రాత్రి అశ్వ వాహనంపై భక్తజనులకు దర్శనమిచ్చారు.బొమ్మసముద్రం, తిరువణంపల్లె, చింతమాకులపల్లె, కారకాంపల్లెలకు చెందిన గొనగుంట బలిజ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉదయం కాణిపాకం పురవీధుల్లో శత కలశాలను పాలతో నింపి వైభవంగా ఊరేగించారు. ఆలయ కల్యాణ వేదికపై సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకువచ్చాక అలంకార మండపంలో ఉత్సవర్లకు విశేష పూజలు నిర్వహించారు. అనతరం ఉత్సవర్లను అశ్వ వాహనంపై మంగళ వాయిద్యాలు, డప్పుల నడుమ లయబద్దంగా యువకులు నృత్యం చేస్తూ ఊరేగించారు.

నేడు ధ్వజావరోహణం

కాణిపాక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.ఉభయదారులుగా ఆలయం తరపువారే వ్యవహరించనున్నారు. రాత్రి వడాయత్తు ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాకర్లవారిపల్లెకు చెందిన గాలి ఉమాపతినాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె ఎం.సుజాత ఉభయదారుగా వ్యవహరించనున్నారు.అనంతరం నిర్వహించే స్వామివారి ఏకాంత సేవకు కాణిపాకానికి చెందిన సోమశేఖరరెడ్డి జ్ఙాపకార్థం వారి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:13 AM